భీమారం ఫారెస్ట్​లో జోరుగా స్మగ్లింగ్​

భీమారం ఫారెస్ట్​లో జోరుగా స్మగ్లింగ్​
  • అటవీ అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు
  • టింబర్ డిపోకు కూతవేటు దూరంలోనే టేకుచెట్ల నరికివేత
  • యథేచ్ఛగా కలప రవాణా

మంచిర్యాల, వెలుగు:హరితహారం పేరుతో ప్రభుత్వం ఓవైపు కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటుతుండగా, మరోవైపు అడవుల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్​పరిధిలోని భీమారం, దాంపూర్ అటవీ ప్రాంతంలో భీమారం మండల కేంద్రానికి చెందిన స్మగ్లర్లు లక్షల విలువైన టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నారు. కలప స్మగ్లింగ్​లో అటవీ శాఖలోని కొందరు అధికారులతో పాటు బేస్​క్యాంప్​ సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు స్మగ్లర్లతో చేతులు కలిపి కలప స్మగ్లింగ్​కు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమారం టింబర్​ డిపోకు కూతవేటు దూరంలో ఉన్న చింతవాగు సమీపంలోని టేకు ప్లాంటేషన్​లో పదుల సంఖ్యలో టేకు చెట్లు నరికివేతకు గురైనా సంబంధిత ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ఫారెస్ట్​ ఆఫీసర్​ అండదండలతో స్మగ్లర్లు బేస్​క్యాంప్​ సిబ్బందికే బ్యాటరీ కట్టర్​, కోత మిషిన్లు, రంపం ఇచ్చి వారితో టేకు చెట్లను నరికించి దుంగలుగా మార్చి స్మగ్లర్లకు సమాచారం అందించడంతో వారు మరుసటిరోజు అక్కడి నుంచి వేరే చోటుకు తరలిస్తున్నారని సమాచారం. స్థానికులు ఎవరైనా ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం అందిస్తే తూతూమంత్రంగా తనిఖీలు చేసి అమాయకులను బలిచేస్తున్నారు. 
 
కలప దొరికితే కేసులు... వసూళ్లు! 
ఈ ప్రాంతంలో అక్రమ కలప నిల్వ ఉన్నట్టు ఫారెస్ట్​ ఆఫీసర్లకు తెలిసినా స్మగ్లర్లతో లింకు ఉండడంతో పట్టుకునే సాహసం చేయడం లేదంటున్నారు. ఇతరులపై మాత్రం కేసులు పెట్టడంతో పాటు వేలల్లో వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపనలు వస్తున్నాయి. ఇటీవలే భీమారంలోని బీసీ హాస్టల్​ సమీపంలో ఇద్దరు బీట్​ ఆఫీసర్లు ఓ ఇంట్లో టేకు కలప నిల్వఉందనే సమాచారంతో దాడి చేసి ఇంటి యజమానులను భయాందోళనకు గురిచేసి పెరటిలో ఉన్న రెండు పాత టేకు దుంగలను పట్టుకున్నారు. వాటికి రూ.12వేల ఫైన్​ కట్టాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని బెదిరించి వేలల్లో వసూలు చేసినట్టు సమాచారం. నెలరోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి అక్రమంగా కలప తరలిస్తుండగా పట్టుకొని కేసు పెట్టి అతడి దగ్గర రూ.20 వేలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.  

పక్కదారి పట్టిస్తున్నారా?  
అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్లు టేకు చెట్లను నరికి ఆ దుంగలను పొదల్లో దాచిపెట్టడం గమనించిన స్థానికులు వాటి గురించి ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం అందించడంతో ఆ కలపను ట్రాక్టర్​లో తరలించారు. వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కలపతో పాటు స్థానికంగా పట్టుకున్న కలపను భీమారం టిండర్​ డిపోకు తరలిస్తారు. కానీ భీమారంలో స్వాధీనం చేసుకున్న కలపను టింబర్​ డిపోకు తరలించకుండా ఫారెస్ట్​ నర్సరీ సమీపంలో దాచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మండలంలోని దాంపూర్ బీట్​లో కలప స్మగ్లర్లు టేకు చెట్లను నరికి బూరుగుపల్లి కోయవాడలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచినట్లు ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచకుండా లీక్​ చేసినట్లు సమాచారం. దీంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్టు తెలిసింది.

ఎంక్వైరీ చేసి యాక్షన్​ తీసుకుంటాం..
భీమారం, దాంపూర్ అటవీ ప్రాంతాల్లో టేకు చెట్లను నరికి కలప స్మగ్లింగ్​ చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఎవరైనా చెట్లు నరికినా ఫారెస్ట్​ ఆఫీసర్లకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై ఎంక్వైరీ జరిపించి బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం.
- రమేశ్, మంచిర్యాల ఎఫ్​ఆర్వో