అవి పాములని చెప్పండయ్యా.. మరీ ఇలా ఉన్నారేంట్రా..? ఈ వైరల్ వీడియో వెనకున్న నిజం ఏంటంటే..

అవి పాములని చెప్పండయ్యా.. మరీ ఇలా ఉన్నారేంట్రా..? ఈ వైరల్ వీడియో వెనకున్న నిజం ఏంటంటే..

భారత్లో ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంది. ఒకే పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకునే వైవిధ్యం కూడా మన దేశంలో చూడొచ్చు. శ్రావణమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఐదవ రోజును నాగపంచమి పండుగగా మన దేశంలో జరుపుకుంటారు. ఆరోజున నాగ దేవత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. పుట్టలో పాలు పోసి పూజిస్తుంటారు. ఇది మనకు తెలిసిన నాగ పంచమి పండుగ. అయితే.. బీహార్లోని సమస్తిపూర్లో నాగపంచమిని ఎలా జరుపుకుంటారో తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

బీహార్ సమస్తిపూర్లోని సింఘియా ఘాట్లో నాగపంచమిని జరుపుకునే తీరే వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా పాములను చేత బట్టుకుని, మెడలో వేసుకుని ఊరేగింపుగా సింఘియా ఘాట్ దగ్గరకు వెళతారు. సింఘియా బజార్లోని మాతా భగవతి ఆలయంలో పూజలతో ఇక్కడ నాగ పంచమి వేడుకలు మొదలవుతాయి.  గంగానదికి ఉపనది అయిన బుర్హి గండక్ నదిలో భక్తులంతా స్నానమాచరిస్తారు. నాగపంచమి రోజుల సింఘియా ప్రాంతంలో ‘పాముల మేళా’ జరుగుతుంది. బుర్హి గండక్ నది తీరం నుంచి భక్తులు ఈ పాములను పట్టుకొస్తారు. 

నాగ పంచమి రోజు ఆ పాములను మెడలో వేసుకుని బుర్హి గండక్ నది దగ్గరకు వెళతారు. వందల మంది చూస్తుండగా ఆ పాములను నదిలో వదులుతారు. ఆ పాములను తిరిగి నదిలో నుంచి చేతులతో, నోటితో బయటకు తీస్తారు. అలా పాములను ఆ నదిలో ముంచి తీస్తే మంచి జరుగుతుందని, నాగ దేవత తమ కోరికలను తీరుస్తుందని స్థానికులు విశ్వసిస్తారు. ఆ తంతు పూర్తి కాగానే.. ఆ పాములను నదిలో నుంచి తీసుకొచ్చి జనావాసాలకు దూరంగా అడవిలో వదిలేస్తారు.

ఇండియాలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే.. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో మాత్రమే నాగ పంచమి పండుగను ఇలా విభిన్నంగా జరుపుకుంటారు. దాదాపు వందేళ్ల నుంచి నాగపంచమిని ఇక్కడ ఇలానే జరుపుకుంటున్నారు.  కాకపోతే.. ఒకప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేకపోవడం, ఇంటర్నెట్ ఇంతలా అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ తంతు గురించి పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ఇన్ స్టాగ్రాంలో చిన్నాపెద్దా తేడా లేకుండా పాములను ఒట్టి చేతులతో ఊరేగింపుగా తీసుకెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం గమనార్హం.