రండి.. మా దేశానికి!.. భారతీయులను ఆకర్షిస్తున్న విదేశాలు

రండి.. మా దేశానికి!.. భారతీయులను ఆకర్షిస్తున్న విదేశాలు
  • వీసా ఫ్రీ ప్రయాణాలకు అనుమతి

విదేశాల్లో   బాగా ఖర్చు చేస్తారు కాబట్టి చాలా దేశాలు మనవారికి రెడ్​ కార్పెట్​ వేసి వెల్​కమ్​ చెబుతున్నాయి. మనోళ్లను ఆకర్షించడానికి ఎన్నో దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయాన్ని తీసుకొచ్చాయి. చైనా టూరిస్టులు తగ్గడంతో ఇవన్నీ భారత్​ వైపు చూస్తున్నాయి.

న్యూఢిల్లీ : భారతీయల ఫారిన్​ ట్రిప్స్​ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. మనోళ్లను ఆకర్షించడానికి చాలా దేశాలు మస్తు ఆఫర్లు ఇస్తున్నాయి.  మన మధ్యతరగతి ఆదాయాలు పెరుగుతుండటంతో ఎక్కువ మంది విదేశీ ప్రయాణాలకు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి చాలా దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇటీవల శ్రీలంక, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్,  మలేషియా భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అందించాయి. వియత్నాం,  ఇండోనేషియాలు కూడా భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇరాన్,  కెన్యా ఇతర దేశాలతో పాటు భారతదేశానికి వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయం కల్పించిన దేశాల జాబితాలో చేరాయి. రష్యా మనదేశానికి ఒక ప్రపోజల్​ పెట్టింది. రెండు దేశాల పర్యాటకులు బృందాలుగా ప్రయాణిస్తే వీసా లేకుండా ఒకరి దేశాలను మరొకరు సందర్శించుకునేందుకు అనుమతించాలి. భారతదేశం నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందుకు జర్మనీ సంతోషంగా ఉంది.  వీసా దరఖాస్తులను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నారని జర్మన్ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్వీలర్ ఇటీవల తెలిపారు. విభిన్న ప్రచారాలు,  ఆఫర్‌‌‌‌‌‌‌‌ల కారణంగా ఈ సంవత్సరం ప్రయాణికుల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉందని ఆయన అన్నారు.

ఊపందుకున్న విదేశీ ప్రయాణాలు

భారతీయ పర్యాటకులకు అనేక ఆసియా దేశాలు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తున్నందున, గత రెండు నెలల్లో ఫారిన్​ ట్రిప్​లకు డిమాండ్ పెరిగిందని ట్రావెల్ కంపెనీలు చెబుతున్నాయి. థాయిలాండ్‌‌‌‌‌‌‌‌లో భారతీయులకు వీసా-రహిత ప్రవేశం ఇస్తున్నట్టు ప్రకటించడంతో అక్కడి వెళ్లడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. థాయ్​లాండ్​కు వెళ్లే వారి సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 30శాతం పెరిగిందని టూర్​ ఆపరేటర్​ థామస్​కుక్​కు చెందిన రాజీవ్ కాలే అన్నారు. డిసెంబర్ 1 నుంచి మలేషియాకు వీసా-రహిత సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, దీనివల్ల ఆ దేశానికి విజిటర్ల సంఖ్య పెరగవచ్చని అన్నారాయన. సెలవుల కాలం సమీపిస్తున్నందున, అక్టోబర్–-డిసెంబర్లో తమ బుకింగ్స్​ 20శాతం పైగా పెరిగాయని ఎస్​ఓటీసీ తెలిపింది.  వీసాలు ఈజీగా దొరుకుతుండటంతో గత నెలలో విమానాలు,  హోటల్ వసతి కోసం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సెర్చ్​లు విపరీతంగా పెరిగాయని ట్రావెల్ ఫిన్-టెక్ కంపెనీ స్కాపియా  తెలిపింది. హాంకాంగ్​, శ్రీలంక కోసం చాలా మంది సెర్చ్​ చేస్తున్నారని వెల్లడించింది. వీసాలు ఈజీగా రావడమే కాదు చౌకైన ధరలు,  ప్యాకేజీలు, మెరుగైన కనెక్టివిటీ వంటివి ప్రయాణాలను పెంచాయి. థామస్ కుక్, ఎస్​ఓటీసీ, ఈజ్​మై ట్రిప్​ వంటి టూర్  ట్రావెల్ కంపెనీలకు గత సంవత్సరంతో పోల్చితే తక్కువ దూరం గల దేశాలకు బుకింగ్స్​ 30శాతం వరకు పెరిగాయి.  టూరిజం రంగ నిపుణుడు అజయ్  మాట్లాడుతూ దేశీయ ప్రయాణాల కంటే అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగాయని చెప్పారు.

పెరిగిన వీసా అప్లికేషన్లు...

వీఎఫ్ఎస్​ గ్లోబల్‌‌‌‌‌‌‌‌లో దక్షిణాసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రబుద్ధ సేన్ మాట్లాడుతూ 2021తో పోలిస్తే గత సంవత్సరం మనదేశం నుంచి వీసా దరఖాస్తులు140శాతం పెరిగాయని వెల్లడించారు.  ఇండోనేషియా,  అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్ వంటి కొన్ని దేశాలు భారతీయులను ఆకట్టుకోవడానికి ఈ–వీసా సదుపాయం తెచ్చాయని చెప్పారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి–  జూన్ మధ్య అవుట్‌‌‌‌‌‌‌‌బౌండ్ ప్రయాణాలు 227శాతం పెరిగాయని ఎస్​ఓటీసీ ట్రావెల్‌‌‌‌‌‌‌‌కు చెందిన డిసౌజా చెప్పారు.

భారతీయ పర్యాటకులను ఎందుకు కోరుకుంటున్నారంటే

వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో 2019లో 2.7 కోట్ల మంది భారతీయులు 28 బిలియన్​ డాలర్లను ఖర్చు చేశారు. ఇలా భారీగా ఖర్చు పెడతారు కాబట్టే విదేశాలు భారతీయులకు రెడ్​కార్పెట్​ స్వాగతం పలుకుతున్నాయి.  ఉదాహరణకు న్యూయార్క్ నగరంలో  700 మిలియన్ల డాలర్లను భారతీయులు ఖర్చు చేసినట్టు తేలింది. అక్కడ అత్యధికంగా ఖర్చు పెట్టిన దేశాల్లో మనది నాలుగోస్థానంలో ఉంది. చిన్నాపెద్దా విదేశీ దేశాలు భారతీయ ప్రయాణికులను ఆదరించడానికి ప్రధాన కారణం చైనా! ఎందుకంటే చైనా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. “నేను వెళ్ళే ప్రతి దేశంలోని అక్కడికి భారతీయ ప్రయాణికులను తీసుకురావడం గురించి వాకబు చేస్తారు.  థాయిలాండ్, జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా లేదా సింగపూర్​లు భారతీయుల టూరిస్టులను కోరుకుంటున్నాయి. చైనీయులు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో మొదటి స్థానంలో ఉన్నారు. వాళ్ల సంఖ్య తగ్గుతుండటంతో విదేశాలు భారత్​వైపు చూస్తున్నాయి" అని బుకింగ్​ డాట్​కామ్​ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ లారా హౌల్డ్స్‌‌‌‌‌‌‌‌వర్త్ ఇటీవల చెప్పారు.