అక్కినేని నాగ చైతన్య వైఫ్, హీరోయిన్ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) సినీ ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా ఎదిగింది. రేపు ఆదివారం (మే31, 2026న) శోభిత తన 34వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా ఆమె సినీ ప్రయాణంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
సెలబ్రిటీ హోదాలో శోభితా రూటే వేరు..
ప్రస్తుత సినీ ప్రపంచంలో సోషల్ మీడియా హడావుడి, భారీ ప్రమోషన్లే స్టార్‌డమ్‌కు కొలమానాలుగా మారిన వేళ.. శోభిత మాత్రం తనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. అతిగా ప్రచారం చేసుకోకుండా, కేవలం తన ప్రతిభ, హుందాతనం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాత్రలు, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతో అనుబంధం, హాలీవుడ్‌లో అడుగుపెట్టడం వంటి విజయాలతో ఆమె తన ప్రత్యేకతను మరింత బలంగా చాటుకుంది.
వైజాగ్ బ్యూటీ టూ గ్లోబల్ స్టార్..
విశాఖపట్నానికి చెందిన శోభిత, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. హిందీలో ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన పలు ప్రాజెక్టుల్లోనూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా రాణిస్తోంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత .. కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది.
గ్లోబల్ వేదికపై తొలి అడుగులు..
2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్న శోభిత, అనంతరం మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ పలు సబ్‌టైటిల్స్ గెలుచుకుని అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్ ‘షార్లెట్ టిల్బరీ’కి బ్రాండ్ ఫేస్‌గా వ్యవహరిస్తున్న ఆమె, భారతీయ చేనేత కళలను ప్రోత్సహించే ‘ఆద్యమ్ హ్యాండ్‌వోవెన్’ కార్యక్రమానికి కూడా మద్దతు ఇస్తోంది.
ఓటీటీలో మలుపు తిప్పిన ‘మేడ్ ఇన్ హెవెన్’
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ శోభితా కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇందులో తారా ఖన్నా పాత్రలో శోభిత నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. హర్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి, ఓటీటీ ప్రపంచంలో అత్యంత టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘ది నైట్ మేనేజర్’ సిరీస్‌లోనూ తన నటనతో ఆకట్టుకుని, విభిన్న పాత్రల్లో మెప్పించగల నటి అని మరోసారి నిరూపించింది.
క్రమశిక్షణతో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం..
మర్చంట్ నేవీ అధికారిగా పనిచేసిన తండ్రి, ఉపాధ్యాయురాలైన తల్లి వద్ద పెరిగిన శోభిత చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, విలువలను అలవర్చుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్‌గా ఉన్న అనుభవం కూడా ఆమె వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. సాహిత్యం, కవిత్వం, భారతీయ శాస్త్రీయ కళలపై ప్రత్యేక ఆసక్తి కలిగిన శోభిత, మోడెర్న్ సెలబ్రిటీ సంస్కృతిలో మేధస్సు, సాంస్కృతిక అవగాహనకు ప్రతీకగా నిలుస్తున్నారు.
