పొలిటికల్​ లీడర్లకు నిద్రలేకుండా చేస్తున్న సోషల్​ మీడియా

పొలిటికల్​ లీడర్లకు నిద్రలేకుండా చేస్తున్న సోషల్​ మీడియా

 

  • ఫలానా వాళ్లు పార్టీ మారుతున్నారంటూ పోస్టులు  
  • వైరల్​ అవుతుండడంతో లీడర్ల పరేషాన్​
  • వివరణ ఇచ్చుకుంటున్న నేతలు 
  • యాదాద్రి జిల్లాలో రెండు కేసులు నమోదు

యాదాద్రి, వెలుగు : సోషల్​ మీడియా పొలిటికల్​ లీడర్లకు నిద్రలేకుండా చేస్తోంది. లీడర్లు పార్టీలు మారుతున్నారంటూ అందులో జరుగుతున్న ప్రచారం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పోస్టులు వైరల్​అవుతుండడంతో సమాధానం ఇచ్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ ఇటీవల టీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరారు. ఇదే సమయంలో యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి కూడా పార్టీ మారుతున్నారంటూ సోషల్​ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఈ విషయం పై దాకా వెళ్లడంతో ప్రచారాన్ని ఖండించాలంటూ ఎమ్మెల్యే పైళ్లపై ఒత్తిడి వచ్చింది. దీంతో ఏనాడు మీడియా ముందుకు రాని పైళ్ల ఆ పని చేయాల్సి వచ్చింది. టీఆర్ఎస్​లోకల్​లీడర్లు భువనగిరి పోలీస్​ స్టేషన్​లో కంప్లయింట్ కూడా ఇవ్వడంతో​ పోస్టులు పెట్టిన ఓ రిపోర్టర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్​ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జి బీర్ల అయిలయ్య కూడా బీజేపీలో చేరుతున్నారంటూ  పోస్టులు వచ్చాయి. దీంతో ఆయన కూడా సోషల్​ మీడియాతో పాటు మెయిన్​ మీడియాలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పైగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షయ్య గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్​ స్వామి గౌడ్​, దాసోజు శ్రవణ్​ కొద్ది రోజుల కింద బీజేపీ నుంచి టీఆర్ఎస్​లో చేరడంతో.. ఇంకా ఎవరెవరు పార్టీ మారుతున్నారో చెబుతూ సోషల్​ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఇందులో టీఆర్ఎస్​కు చెందిన మాజీ మంత్రి పద్మారావు, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, ఏపీ విఠల్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రుఘునందన్​రావు ఉన్నారు. దీంతో వారంతా మేము పార్టీ మారబోవట్లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.