పద్మారావునగర్/మల్కాజిగిరి, వెలుగు: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. బోడుప్పల్‌లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38), ఆమె కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) శనివారం రాత్రి తమ కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
అనంతరం సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని గుర్తించిన లోకో పైలట్ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం వారి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు లభించకపోవడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. కాగా, విజయశాంతి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తోంది.
ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారి ఇద్దరు పిల్లలు పటాన్‌చెరులోని ఓ కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. పిల్లలను విజయ శుక్రవారం రాత్రే ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత చర్లపల్లి స్టేషన్‌కు తమ సొంత కారులో వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కారులో సూసైడ్ నోట్ దొరికినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ రైల్వే పోలీసులు ధ్రువీకరించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
