512 కిలోల ఉల్లి..70 కి.మీ నడక..వచ్చింది రూ. 2

512 కిలోల ఉల్లి..70 కి.మీ నడక..వచ్చింది రూ. 2

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు సరైన న్యాయం ఎక్కడా జరగడం లేదు. వ్యాపారుల దౌర్జన్యానికి రైతులు మోసపోతూనే ఉన్నారు. 512 కిలోల ఉల్లి విక్రయించిన ఓ రైతుకు చివరికి రూ.2 లే మిగిలింది. దీన్ని బట్టి రైతులు ఎలాంటి దీనస్థితిలో బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

షోలాపూర్ జిల్లాలోని రాజేంద్ర చవాన్ అనే రైతు ఫిబ్రవరి 17న తాను పండించిన ఉల్లిపాయలను బస్తాల్లో వేసి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ మార్కెట్‭కు తీసుకెళ్లాడు. అతడు తీసుకువెళ్లిన ఆ ఉల్లి బస్తాలను తూకం వేయగా రూ.512 కిలోలు వచ్చింది. అయితే ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో.. అతడు తీసుకెళ్లిన ఉల్లిపాయలను కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేస్తామని వ్యాపారులు తెలిపారు. దీంతో చవాన్ తీసుకెళ్లిన ఉల్లిపాయలకు రూ.512లు చెల్లించారు. అందులో రవాణా, కూలీల ఖర్చు, తూకం ఛార్జ్ అన్నీ కలిపి రూ.503.51 అయింది. అన్నీ పోగా చివరికి 2 రూపాయల 49 పైసలు మిగిలింది. దాన్ని కూడా రౌండ్‌ ఫిగర్‌ చేసి రూ.2లకు ఆ రైతుకు మార్కెట్ యార్డు వ్యాపారులు చెక్ ఇచ్చారు. చవాన్ కు ఇచ్చిన రసీదు, చెక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజెన్లు మండిపడుతున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.