ఆలయాలపై సోలార్ రూఫ్​టాప్​లు : కొండా సురేఖ

ఆలయాలపై సోలార్ రూఫ్​టాప్​లు : కొండా సురేఖ
  • ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు: కొండా సురేఖ
  •     ముందుగా భద్రకాళి, యాదగిరిగుట్టపై ఇన్​స్టాల్
  •     కార్యాచరణ వేగవంతం చేయాలి
  •     అధికారులకు మంత్రి ఆదేశం
  •     ఆలయ భూములు, బోనాల జాతరపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ఆలయాల మీద సోలార్ రూఫ్​ టాప్​ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ముందుగా వరంగల్​లోని భద్రకాళి ఆలయం, యాదగిరిగుట్ట టెంపుల్​పై ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్​రూఫ్ టాప్ ల ఏర్పాటు దిశగా కార్యాచరణ స్పీడప్ చేయాలన్నారు. దీంతో ఆలయానికి అవసరమైన కరెంట్ ఫ్రీగా లభిస్తుందని, ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. ఆ నిధులను టెంపుల్ డెవలప్​మెంట్​కు కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, బోనాల ఉత్సవాలు, కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో పాటు మరికొన్ని అంశాలపై సెక్రటేరియెట్​లో మంత్రి సురేఖ మంగళవారం రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ, రెడ్కో, డిస్కమ్స్​తో చర్చించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గైడ్​లైన్స్ రూపొందించాలి. ఆదాయం లేని, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్స్ ఖర్చు చేయాలి. తెలంగాణ రెన్యూవబుల్‌‌ ఎనర్జీ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ (రెడ్కో) సహకారంతో సాగులో లేని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు గైడ్​లైన్స్ తయారు చేయాలి”అని తెలిపారు.

హెడ్ ఆఫ్ అకౌంట్ పోస్టు క్రియేట్ చేయండి

సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉన్న దేవాదాయ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ‘‘కామన్ గుడ్ ఫండ్స్ ఖర్చుల విషయంలో పారదర్శకత కోసం ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ పోస్టును క్రియేట్ చేయాలి. ఆలయాల అభివృద్ధి, దేవాదాయ భూముల పరిరక్షణ, భద్రత, రెనోవేషన్, కల్యాణ మండపాల నిర్మాణం, ఆలయాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేయాలి. దేవాదాయ శాఖలో ఏండ్లుగా ప్రమోషన్​కు నోచుకోని ఉద్యోగులతో పాటు బదిలీల విషయంలో త్వరలోనే గైడ్​లైన్స్ ప్రకటిస్తాం. ఎండోమెంట్ పరిధిలోని భూములు, షాపుల లీజ్​లకు సంబంధించి పాత మార్గదర్శకాలకు సవరణలు చేయాలి. కొత్త గైడ్​లైన్స్ రూపొందించాలి’’అని తెలిపారు. భక్తుల నుంచి స్వీకరించిన కానుకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్టేడ్ చేయాలని సూచించారు. 

తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా బోనాలు

బోనాల జాతర నేపథ్యంలో ఆలయాలను అందంగా ముస్తాబు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ‘‘భక్తులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలి. తెలంగాణ సంస్కృతి చాటేలా కార్యక్రమాలను నిర్వహించాలి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బోనాల పోస్టర్, క్యాలెండర్​ను ఆవిష్కరిస్తాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీజీఎఫ్​కు రూ.150 కోట్లు కేటాయించాలని రేవంత్​ను కోరుతాం. బోనాల నేపథ్యంలో ఆలయాలకు నిధులు రిలీజ్ చేయడం ప్రారంభించాలి’’అని మంత్రి అన్నారు. రివ్యూ మీటింగ్​లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, అడిషనల్ కమిషనర్ లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.