ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తలే..

 ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తలే..

వరంగల్ నగరంలో  వరుస అగ్నిప్రమాదాలతో ఆందోళన చెందుతున్నారు జనం. ఎండాలకాలంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జనాభాకు తగినట్టుగా అగ్నిమాపక యంత్రాలు లేకపోవడం వల్ల ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. ఈమధ్య వరంగల్ చౌరస్తాలోని షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. హనుమకొండలో బట్టల షాపులోనూ పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రెండు చోట్ల టైమ్ కి అగ్నిమాపక వాహనాలు  రాక పోవటంతో షాపులలోని బట్టలు, వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. నగరంలోని కొత్త భవనాల నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాలయాలు, ఆస్పత్రులు, మల్టీఫ్లెక్స్ లు, సినిమా హాల్స్, ఫంక్షన్  హాళ్లు, అపార్టు మెంట్స్ ... ఇలా బహుళ అంతస్థుల భవనాల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలను బిగించాలి.

షాట్ సర్క్యుట్ కాకుండా పవర్ సప్లయ్ కి  స్టాండెడ్ వైర్లు అమర్చేలా  చూడాలి. భవనం చుట్టూ  ఫైర్  ఇంజన్  వాహనం తిరిగేలా స్థలం విడిచిపెట్టాలి. అయితే నగరంలోని చాలా భవనాల్లో ఫైర్ సేఫ్టీ లేదని తెలుస్తోంది. అధికారులను మేనేజ్  చేసుకుని నిబంధనలకు విరుద్దంగా భవనాలు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  వరంగల్ జిల్లా గీసుగొండ మండలం  ధర్మారం దగ్గర టెస్కోకు సంబంధించిన గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ. 38 కోట్ల విలువైన  ఆస్తినష్టం జరిగింది. ఏడు ఫైర్  ఇంజన్లు, 65 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అందుబాటులో వాటర్  లేకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. పైర్ సేప్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనఖీలు చేసి ప్రమా దాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. 

వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణమంటున్నారు అధికారులు. ఎండకాలంలో పవర్ వాడకం పెరగటంతో  వైర్లు వేడెక్కి  షార్ట్  సర్క్యుట్ తో  ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. నగరంతో పాటు అడవి ప్రాంతంలో  ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.