కావాలనే కొందరు యువకులు కేబుల్ బ్రిడ్జిని షేక్ చేశారు

కావాలనే కొందరు యువకులు కేబుల్ బ్రిడ్జిని షేక్ చేశారు

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి ఓ కుటుంబం కీలక విషయాలు వెల్లడించింది. ఘటనకు కొన్ని గంటల ముందే సదరు కుటుంబం అక్కడి నుంచి భయంతో వెనక్కి వచ్చినట్లు చెప్పింది. వారు ఆ వంతెనపైకి ఎక్కినపుడు కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా బ్రిడ్జిని షేక్ చేస్తూ పర్యాటకుల్ని భయాందోళనలకు గురిచేశారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఆ వంతెను గట్టిగా తన్నారని, అది ప్రమాదకరమని భావించి, తామంతా అక్కడి నుంచి వెనక్కి వచ్చినట్టు చెప్పారు. ఈ విషయాన్ని బ్రిడ్జి వద్ద పనిచేసే సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని అన్నారు. 

యువకులు బ్రిడ్జిపై పర్యాటకుల్ని భయాందోళనకు గురి చేసిన కొన్ని గంటలే వంతెన కూలిపోయి నీళ్లలో పడిపోయిందని సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిడ్జి సిబ్బంది టికెట్లు అమ్మడంపైన దృష్టి పెట్టారే తప్ప తమ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. రద్దీని నియంత్రించే వ్యవస్థ తమ వద్ద లేదని సమాధానం చెప్పారని చివరకు తాము భయపడిందే జరిగిందని చెప్పారు.

బ్రిటీష్ కాలం నాటి వంతెనను 7 నెలల పాటు పునరుద్ధరణ పనుల కోసం మూసివేశారు. నాలుగు రోజుల క్రితమే దాన్ని ఓపెన్ చేశారు. దీపావళి సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 141మంది చనిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రుల్లో చేర్పించే పనుల్లో సహాయక సిబ్బంది నిమగ్నమైంది.