
- తెరవెనక పొలిటీషియన్లు, అధికారులు
- పదిహేనేళ్ల పాత లైసెన్స్‌లతో కొనసాగుతున్న అక్రమాలు
ఆదిలాబాద్, వెలుగు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా మాంగనీస్ ఖనిజాన్ని దోచుకుంటూ కోట్లకు పడగెత్తారు కొందరు అక్రమార్కులు. అధికారుల్ని మచ్చిక చేసుకుని మరికొందరు గప్ చుప్ గా పనులు కానిస్తున్నారు. అదును చూసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాతో అక్రమార్కుల సామ్రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది. ప్రస్తుతం వాళ్లే రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుండటంతో అడిగేవాళ్లే లేకుండా పోయారు. నాలుగేళ్ల కిందట తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ.. అది నామ్ కే వాస్తే కావడంతో అక్రమార్కుల పనులు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి.
నిబంధనలు బేఖాతర్
పదిహేనేళ్ల కిందట అధికారుల్ని మచ్చిక చేసుకుని మాంగనీస్ తవ్వకాలకు లైసెన్సులు పొందిన కొన్ని కంపెనీలు.. అవే అనుమతుల పేరిట ఇప్పటివరకూ లెక్కా పక్కాల్లేకుండా తవ్వకాలు జరుపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3 వేల ఎకరాల్లో మాంగనీస్ తవ్వకాలు జరిపినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లోనే దాదాపు 2 వేలకుపైగా ఎకరాల్లో తవ్వకాలు జరిగాయని రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే అవేవీ ఇప్పటి రూల్స్ కు సరిపోవని, తాజాగా కొత్త లైసెన్స్ పొందినవారికే పర్మిషన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నిబంధనల ప్రకారం అగ్నిమాపక, పోలీస్ శాఖల అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు కూడా తనిఖీలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
పదేళ్ల కిందట 14 కంపెనీలకు అప్పటి సర్కారు.. జిల్లాలో మాంగనీస్ తవ్వకాలకు అనుమతులిచ్చింది. వారితో పాటు మరో 20 కంపెనీల వరకు రంగంలోకి దిగి జిల్లాలోని వేలాది ఎకరాల భూమిని తవ్వేశారు. తాంసి మండలం( సర్వే నంబర్లు 27,29, 35, 43 _ 49, 50, 51,185), జైనథ్ మండలం( సర్వే నంబర్లు 1, 6, 10, 11, 15, 16, 46 ,107, 24, 25, 36, 37, 38, 41,45), ఆదిలాబాద్ మండలం (సర్వే నంబర్లు 1_4, 7_ 59, 62, 63 ) సర్వే నంబర్లలోని భూముల్లో మాంగనీస్ ఖనిజాలను తవ్వుకునేందుకు ప్రొస్పెటింగ్ లైసెన్స్ (పీఎల్) ఇచ్చినట్లు తెలిసింది. అయితే శాంపిల్ సేకరించి ఖనిజాలున్నాయని నిర్ధారించిన మీదటే తవ్వకాలు కొనసాగించాలనే నిబంధన మేరకే పీఎల్ లైసెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, నిబంధనలన్నీ పక్కన పెట్టి ఇష్టారీతిన వేలకొద్దీ టన్నుల ఖనిజాలను తవ్వుకెళ్లారు. ఇదంతా ఇన్నేళ్లుగా జరుగుతున్నా ప్రశ్నించే అదికారులే లేకపోవడం గమనార్హం. ఇప్పటికీ దందా నడుస్తున్నా పట్టించుకునేవారే కనిపించడంలేదు.
అధికార పార్టీ అండతోనే..
పదెకరాల్లో ఖనిజం తవ్వేందుకు అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు వందల ఎకరాల భూముల్ని లూటీ చేస్తూ ఇప్పటికీ దందా నడిపిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి బంధువులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కాంగ్రెస్ నేత బంధువుల పేరిట కొందరు వ్యాపారులు మైనింగ్ లైసెన్స్ తీసుకుని చాలా రోజుల పాటు పనులు నడిపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ఇష్టారాజ్యంగా వ్యాపారం నడిపించి సర్కారు ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొట్టారు. సేమ్ టు సేమ్ నిర్మల్ లో ఓ సీనియర్ నేత కూడా దగ్గరుండి అక్రమ దందా నడిపించినట్లు సమాచారం. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత ఒకరికి కూడా ఇందులో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ నేతలు మద్దతు కూడా వీరికి ఉండటం వల్లే ఇప్పటికీ దందా పరేషాన్ లేకుండా సాగుతోందని, వేల ఎకరాల్లో మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నా వాళ్లెవరూ నోరు తెరవట్లేదని తెలుస్తోంది.
అమాయకుల ప్రాణాలు పోతున్నయ్
మాంగనీస్ తవ్వకాల కారణంగా రైతులు బలవుతున్నారు. గోతులు తవ్విన వెంటనే వాటిని మూసివేయకుండా వదిలేస్తుండడంతో ఆ గోతుల్లో పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. తాంసి మండలం నిపాని శివారులోని భూమిలో ఓ కాంట్రాక్టర్ తవ్వకాలు ప్రమాదవశాత్తు లోయలో పడి ముగ్గురు రైతులు చనిపోయారు. ఓ గొర్రెల కాపరి కూడా అక్కడికి వచ్చి లోయలో పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా పలు చోట్ల తవ్వకాల కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ మైనింగ్ చర్యలను అడ్డుకోవాలని కోరుతున్నారు.