ప్రభుత్వంపై కొంతమంది టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేల అసంతృప్తి

ప్రభుత్వంపై కొంతమంది టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేల అసంతృప్తి

 

  • యాదాద్రి జడ్పీ మీటింగ్​లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల అసంతృప్తి

    యాదాద్రి, వెలుగు: సొంత ప్రభుత్వంపై టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ పరిహారం ఇవ్వకపోగా.. రైతుబంధు నిలిపివేయడంపై జడ్పీ మీటింగ్​లో ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా జడ్పీ సమావేశం ఆదివారం జరిగింది. మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాగా రోడ్లు, ఇరిగేషన్, హెల్త్, వెల్ఫేర్, ట్రాన్స్​కో అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్స్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఒక్కరూ సరిగా పని చేయడం లేదని, వారి మధ్య సమన్వయం కూడా లేదన్నారు. కొన్ని పనులు తాము చెప్పినా చేయడం లేదని, కొన్ని తమ దృష్టికి కూడా రావడం లేదని చెప్పారు. కరెంట్​డిపార్ట్​మెంట్​ఎంప్లాయ్స్​కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని మెంబర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్​ఫార్మర్స్, కరెంట్​పోల్స్ పై ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీ ప్రజాప్రతినిధులైనా వారి విషయంలో కరెంట్​ఎంప్లాయ్స్​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని మంత్రి జగదీశ్​రెడ్డి హెచ్చరించారు. 
    డ్రైవర్, డీజిల్​ లేకుండా అంబులెన్సులు
    తమ పరిధిలోని పీహెచ్​సీలకు అంబులెన్స్​లు కావాలని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు కోరారు. ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి, జడ్పీ చైర్మన్​ సందీప్​రెడ్డి ఇచ్చిన అంబులెన్స్​లు ఉన్నా.. వాటికి డ్రైవర్లు లేరని, డీజిల్​ కూడా కేటాయింపు లేదని డీఎంహెచ్​వో సాంబశివరావు చెప్పారు. రోడ్లపై జరిగిన చర్చలో జడ్పీ కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​ కుడుదుల నగేశ్​మాట్లాడుతూ రోడ్లు ఎక్కడ సరి చేయడం లేదని, అసలు ఫండ్స్​ఇస్తున్నారా  అని ప్రశ్నించారు. మెంబర్లు కొందరు రోడ్ల విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించగా.. జడ్పీ చైర్మన్​సందీప్​రెడ్డి కలుగజేసుకొని ‘ఏ పనైనా మీ చేతుల్లో లేదు. మా చేతుల్లోనూ లేదు. మీరు ఇక్కడ చెబుతున్నారు.. మేమెవరికి చెప్పుకోవాలే’ అని కామెంట్​ చేశారు. జడ్పీ నిధులపై  కాంగ్రెస్​ జడ్పీటీసీలు మంత్రి జగదీశ్​రెడ్డిని నిలదీశారు. గెలిచి రెండేండ్లవుతున్నా ఇప్పటివరకూ ఒక్కపైసా మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో డెవలప్​మెంట్ కార్యక్రమాలు జరగుతున్నాయని మంత్రి జగదీశ్​రెడ్డి చెప్పబోగా.. అవి కేంద్రం నుంచి వస్తున్న నిధులని, మీరిచ్చినవి కావంటూ జడ్పీటీసీలు సమాధానమిచ్చారు.   

సమస్యలపై లీడర్ల అసహనం
రాజాపేట మండలంలోని రైతులకు పరిహారం, రైతుబంధు ఇవ్వలేదని ఆలేరు ఎమ్మెల్యే  గొంగిడి సునీత అన్నారు. రాయగిరి -మోత్కూరు మధ్య రోడ్డు వెడెల్పు పనులు ఆలస్యంగా చేస్తున్నారని, భునాదిగాని కాల్వ వెళ్లే చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేయాలని సూచించినా ఇరిగేషన్​ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. భునాదిగాని కాల్వ కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వలేదని, అడ్గగూడూరులో భూసర్వే విషయం  కలెక్టరేట్​లో పెండింగ్​లో ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. మోత్కూర్ గురుకుల స్కూల్​లో ఎస్సీకి రిజర్వ్ చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును స్థానికులకు కాకుండా రంగారెడ్డి జిల్లాకు చెందిన బీసీ కులానికి చెందిన వారికి ఇచ్చారని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మారెడ్డి కాలువ కోసం రామన్నపేట, వెల్లంకి తదితర గ్రామాల రైతులకు 2014లో రూ.1.67 కోట్లు మంజూరయ్యాయని, ఆ ఫండ్స్​ఇప్పటివరకు ఇవ్వలేదని నకిరేకల్​ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆసిఫ్​నగర్​ కాలువ, పిలాయిపల్లి కాలువపై బడ్జెట్​శాంక్షన్​అయినా పనులు చేయడం లేదన్నారు. ఇంద్రపాలనగరం చెరువు ఆక్రమణకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు.