అటు తండ్రి మరణం ఇటు కొడుకు జననం

అటు తండ్రి మరణం ఇటు కొడుకు జననం
  •    కొడుకును చూసుకోకుండానే కన్నుమూసిన తండ్రి 
  •     భార్యకు చెప్పకుండానే దహన సంస్కారాలు
  •     వనపర్తి జిల్లా శేర్​పల్లిలో విషాదం 

వనపర్తి, శ్రీరంగాపూర్, వెలుగు : ఆమె ఓ సర్పంచ్. పిల్లలంటే ప్రాణం. పెండ్లయిన16 ఏండ్లకు గర్భం దాల్చింది. నెలలు నిండడంతో కాన్పు అయ్యాక తన బిడ్డను భర్తకు చూపించి 
మురిసిపోవాలనుకుంది. అంతలోనే భర్త అనారోగ్యంతో హైదరాబాద్​లోని ఓ హాస్పిటల్​లో చేరాడు. కిడ్నీలు ఫెయిల్ ​కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో పురిటి నొప్పులతో అతడి భార్య కొల్లాపూర్ పట్టణంలోని దవాఖానలో చేరింది. కొద్ది గంటలకే బాబుకు జన్మనిచ్చింది. భర్త చనిపోయిన విషయం చెబితే ఆమెకు ఏమవుతుందోనని కుటుంబసభ్యులు చెప్పలేదు. హైదరాబాద్​ నుంచి శవాన్ని ఊరికి తీసుకువచ్చి భార్యకు తెలియకుండానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేర్​పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రాజశేఖర్ (42) బీఆర్ఎస్ లీడర్. ఈయన తన భార్య సునీతను నాలుగేండ్ల కింద సర్పంచ్ గా పోటీ చేయించి గెలిపించుకున్నాడు. అంతా బాగానే ఉన్నా పిల్లలు లేని లోటు వారిని బాధపెడుతూ ఉండేంది. 16 ఏండ్లయినా పిల్లలు లేకపోవడంతో వేదన అనుభవించేవారు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో అంతులేని ఆనందం నెలకొంది. నెలలు నిండడంతో పాపో..బాబో పుడతారని...ఇక సంతోషంగా ఉండొచ్చనుకున్నారు. కానీ, అంతలోనే విషాదం వెంటాడింది. రాజశేఖర్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవ్వడంతో దవాఖానలో చూపించుకోగా కిడ్నీలు ఫెయిల్​ అయ్యాయని తెలిసింది. దీంతో హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సునీతను కాన్పు కోసం దవాఖానలో జాయిన్​ చేశారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి 10 గంటలకు రాజశేఖర్​చనిపోగా,  బుధవారం తెల్లవారుజామున సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా భర్త చనిపోయిన విషయం తెలియని సర్పంచ్ ..తన భర్త వస్తాడని కొడుకును చూపించాలని కొల్లాపూర్ దవాఖానలో ఎదురుచూస్తోంది.