సోనియా గాంధీ విచారణ..కాంగ్రెస్ శ్రేణుల నిరసన

సోనియా గాంధీ విచారణ..కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సోనియాను ఈడీ  ప్రశ్నించింది. మంగళవారం దాదాపు 6 గంటలపాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు ఉన్న 90 కోట్ల రూపాయల అప్పును యంగ్ ఇండియాకు బదలాయించడంపై ఈడీ ప్రశ్నలు సంధించింది. యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపై కూపీ లాగారు. సోనియా స్టేట్మెంట్ ను మొత్తం రికార్డు చేశారు. రెండు రోజుల విచారణలో భాగంగా సోనియా గాంధీని 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు.  

ఇక సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. సత్యాగ్రహ పేరుతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైలు ఆపేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఏఐసీసీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బ్యారికేడ్లతో అక్బర్ రోడ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్టితో సోనియా ఈడీ విచారణ ముగిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.