V6 News

పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని.. నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‎కు సమాధానం చెప్పాలని కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

కేసు ఏంటంటే..?

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చబడిందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల జాబితాలో చేర్చారని.. కానీ1983లో ఆమె భారత పౌరసత్వం పొందారని పిటిషనర్​కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

భారత పౌరసత్వం పొందటానికి ముందే ఓటు హక్కు పొందడటం కోసం ఆమె నకిలీ పత్రాలను సృష్టించారని పిటిషనర్ ఆరోపించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో 2025, సెప్టెంబర్‎లో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా ఈ పిటిషన్ డిస్మస్ చేశారు. ఈ క్రమంలో మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు వికాస్ త్రిపాఠి. మంగళవారం (డిసెంబర్ 9) ఈ రివిజన్ పిటిషన్‎పై విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే సోనియా గాంధీ, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను 2026, జనవరి 6కు వాయిదా వేశారు.