- బెంగాల్ ఎన్నికల కోసమే ‘వందేమాతరం’పై చర్చ
- ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెహ్రూను మోదీ టార్గెట్ చేస్తున్నారు: ప్రియాంక
- స్వాతంత్ర్యోద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు
- దేశం కోసమే జీవించారు.. దేశం కోసమే మరణించారు
- డీఆర్‌డీవో పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేదని ప్రశ్న
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై చర్చ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ ప్రధాని నెహ్రూను మోదీ టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం లోక్‌సభలో ‘వందేమాతరం’ గేయంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ప్రియాంకాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘ప్రధాన మంత్రిగా మీరు 12 ఏండ్లు పూర్తి చేసుకుంటున్నారు. జవహర్ లాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం దాదాపు అంతేకాలం జైలులో గడిపారు. ఆ తర్వాత 17 ఏండ్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మీరు ఆయన్ని చాలా తిట్టారు. కానీ ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళ్‌యాన్ ఎక్కడ ఉండేది? డీఆర్‌డీవో పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేది? ఐఐటీ, ఐఐఎంలు పెట్టకపోతే ఐటీలో మనం ముందుండేవాళ్లమా? ఎయిమ్స్ పెట్టకపోతే కరోనా లాంటి సవాలును ఎదుర్కొనేవాళ్లమా?” అని మోదీని ప్రశ్నించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జీవించారు.. దేశానికి సేవ చేస్తూ మరణించారు అని పేర్కొన్నారు.
నెహ్రూ జీవితంపై చర్చిద్దామా?
వందేమాతరం గేయంలాగే నెహ్రూ జీవితంపైన కూడా చర్చిద్దామంటే తాము రెడీ అని ప్రధాని మోదీకి ప్రియాంకాగాంధీ సవాల్ విసిరారు. ‘‘మీరు నెహ్రూ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మనం నెహ్రూపై చర్చకు సమయం కేటాయించుకుందాం. ఆయన గురించి మీరు ఏమేం మాట్లాడాలనుకున్నారో ఓ లిస్ట్ రెడీ చేయండి. వాటిపై చర్చిద్దాం. దేశం వింటుంది కదా.. ఇందిరాగాంధీ ఏం చేశారు.. రాజీవ్‌గాంధీ ఏం చేశారు, వంశపారంపర్య రాజకీయం అంటే ఏమిటి? నెహ్రూ తప్పులు ఏమిటి? ఇవన్నీ మాట్లాడుకుని ఈ చాప్టర్‌ను ముగిద్దాం. ఆ తర్వాత నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలపై చర్చిద్దాం” అని అధికార బీజేపీకి సూచించారు. అంతేకానీ.. పార్లమెంట్అమూల్యమైన
సమయాన్ని వృథా చేయొద్దని అన్నారు.
బీజేపీకి దేశంకంటే ఎన్నికలే ముఖ్యం
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరం గేయంపై చర్చించాల్సిన అవసరం ఏముందని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ఈ దేశ ప్రజలు సంతోషంగా లేరని, వారిని ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్చ జరపడం లేదని, వాటినుంచి ప్రజల దృష్టిని గతంపై మళ్లించేందుకే వందేమాతరంపై చర్చ పెట్టిందని మండిపడ్డారు. వందేమాతరం.. ధైర్యం, త్యాగానికి చిహ్నమని పేర్కొన్నారు.
ఇది మన ఆత్మలో ఒక భాగం అని, ఇది దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నదని, అలాంటప్పుడు చర్చ ఎందుకని బీజేపీని నిలదీశారు. దేశ ప్రయోజనాల కంటే ఎన్నికలకే బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. సభలో పదే పదే అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తూ ఎన్నికల హడావుడిగా బీజేపీ ముందుకు సాగుతున్నదని.. కానీ, కాంగ్రెస్ మాత్రం జాతీయ విలువల కోసం పోరాడుతున్నదని తెలిపారు. దేశ ప్రయోజనాలపై పోరాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

