ఖర్గే ఇంటికి వెళ్లి విషెస్ చెప్పిన సోనియా

ఖర్గే ఇంటికి వెళ్లి విషెస్ చెప్పిన సోనియా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఫలితాలు వెలువడిన అనంతరం రాజాజీ మార్గ్ లోని ఖర్గే ఇంటికి వెళ్లిన సోనియా ఆయనకు విషెస్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే  సోనియా నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకుంటారని అంతా భావించారు. ఇందుకోసం ఆయన సోనియాను అపాయింట్ మెంట్ కూడా కోరారని వార్తలొచ్చాయి. అయితే  ఎవరూ ఊహించని విధంగా స్వయంగా సోనియానే ఖర్గే నివాసానికి వెళ్లి కొత్త అధ్యక్షుడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి ఓ వ్యక్తి పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లడం చాలా అరుదు. 2015లో బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను  సోనియా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా కూతురు ప్రియాంక గాంధీతో కలిసి సోనియా పార్టీ నూతన అధ్యక్షుడు ఖర్గే ఇంటికి వెళ్లారు. 

కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా నిర్ణయాధికారం మాత్రం గాంధీ కుటుంబం చేతిలోనే ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియా కొత్త అధ్యక్షుడి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే భారత్ జోడో యాత్రలో  ఉన్న రాహుల్ గాంధీ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో తన పాత్రను కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తారని, త్వరలోనే  ఖర్గేను కలవనున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు గాంధీ కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.