అగ్గిపుల్లపై సోనూ ముఖాన్ని చెక్కాడు

అగ్గిపుల్లపై సోనూ ముఖాన్ని చెక్కాడు

తాండూర్:  పెన్సిల్‌తో బొమ్మలు గీయడం వేరు. ఆ పెన్సిల్ ముల్లునే అందమైన ఆకృతిగా మలచడం వేరు. అదో అద్భుతమైన కళ. పెన్సిల్‌ లిడ్‌పై కళాఖండాలు చెక్కాలంటే ఎంతో ఓర్పు.. నేర్పు ఉండాలి. అలాంటి అద్భుతమైన సూక్ష్మ కళాకృతులను రూపొందించడంలో రంగారెడ్డి జిల్లా తాండూరుకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కడ్ మధుసూదన్ ఆరి తేరారు. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన మధు.. మైక్రో ఆర్టిస్టుగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా సోనూసూద్ ప్రశంసలు అందుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్గిపుల్లపై సోనూ ముఖాన్ని చెక్కి అందరినీ అబ్బురపరిచారు.

పెన్సిల్ ముల్లు, అగ్గిపుల్లపై ఆకృతులు చెక్కడంలో మధు దిట్ట. పెన్సిల్ లిడ్‌పై అతను మలిచిన గణేశ్, మోదీ, శివాజీ మహరాజ్, గౌతమబుద్ధ, చాయ్ కెటిల్, ఉరితాడు ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చాయి. 2018లో నువ్వుల గింజలపై భారతదేశపు చిత్రపటం, హనుమాన్ బొమ్మలు గీసి రికార్డులకెక్కారు. మధుసూదన్ ప్రస్తుతం నగరంలోని మసాబ్ ట్యాంక్‌లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చివరి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బిర్కాడ్ బాబు, తల్లి ఆశా బాయి. పెయింట్ కాంట్రాక్టర్ అయిన తన తండ్రి 2016లో చనిపోయినట్టు మధు తెలిపారు.

గత నాలుగేళ్లలో 200కు పైగా కళాకృతులను సృష్టించినట్టు చెప్పారు. 0.7 పెన్సిల్ కార్వింగ్ విభాగంలో పెన్సిల్ లిడ్‌పై ఆంగ్ల అక్షరమాలను చెక్కిన మధు.. రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. అంతేగాక ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఏనాటికైనా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.