త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం : సీఎం కేసీఆర్

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు  ఏర్పాటు చేస్తాం : సీఎం కేసీఆర్

వర్చువల్​గా స్టార్ట్ చేసిన సీఎం కేసీఆర్ 

రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా 8 మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, రామగుండం మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ‘‘తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయం.. మరిచిపోలేని రోజు. గతంలో తాగునీటికి, సాగునీటికి, మెడికల్‌ సీటుకు, ఇంజినీరింగ్‌ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డాం. తెలంగాణ ఏర్పడడంతో అద్భుతంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. దేశానికే మార్గదర్శకమైన అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. మహబూబాబాద్‌, వనపర్తి లాంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్​కాలేజీలు వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. వాటి ఏర్పాటుకు కారణం సొంత రాష్ట్రం రావడమే. ఉద్యమకారులే పరిపాలన చేయడం” అని అన్నారు. మరో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాల్సి ఉందని, అందుకు అనుమతి కూడా ఇచ్చామని చెప్పారు. కాలేజీల ఏర్పాటుకు కృషి చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ ను అభినందించారు. కాగా, కొత్త కాలేజీల్లో 1,150 సీట్లు ఉండగా.. రాష్ట్రంలో మొత్తం మెడికల్​కాలేజీల సంఖ్య 17కి చేరింది. 

ఎంబీబీఎస్ సీట్లు పెంచినం.. 

గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడా సంఖ్యను 2,790కి పెంచామని కేసీఆర్ తెలిపారు. ‘‘గతంలో 531 పీజీ సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 ఉంటే, ఇప్పుడు 152 సీట్లు ఉన్నాయి” అని చెప్పారు. ‘‘జనాభాకు సరిపడా డాక్టర్ల అవసరం ఎంతుందో, పారా మెడికల్ సిబ్బంది అవసరం అంతే ఉంది. అందుకే వాళ్ల సంఖ్యను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.