హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, ఐ బ్యాంకులు, కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్లు, ఐ రిట్రీవల్ సెంటర్స్, సంబంధిత ఎన్జీవోలు ఇక నుంచి స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్వోటీటీవో) లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జీవన్ దాన్ (సోట్టో) విభాగం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్ ప్లాంట్స్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ (టీహెచ్ఓటీఏ) 1994 రూల్స్ ప్రకారం.. ఐ డొనేషన్ ప్రక్రియలో పారదర్శకత, ప్రమాణాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవన్ దాన్ అధికారులు వెల్లడించారు.
కార్నియా సేకరణ, ట్రాన్స్ ప్లాంట్ చికిత్సల్లో మెరుగైన సమన్వయం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లోని సోట్టో ఆఫీసులో సంప్రదించవచ్చని లేదా 040-–23489494, టోల్ ఫ్రీ నంబర్ 1800–-599-–9143 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
