కుర్రాళ్లే కావాలి: పుజారా, రహానేను తప్పించడాన్ని సమర్ధించిన గంగూలీ

కుర్రాళ్లే కావాలి: పుజారా, రహానేను తప్పించడాన్ని సమర్ధించిన గంగూలీ

దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా టెస్టు జట్టు నుంచి వెటరన్‌ బ్యాటర్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానెలను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా లాంటి పిచ్ లపై అనుభవాన్ని పక్కన పెట్టేయడంతో సెలక్షన్ విధానంపై కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఇద్దరు సీనియర్లను తప్పించాలనే సెలక్టర్ల నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సమర్ధించాడు. ఈ ఇద్దరి అవసరం భారత జట్టుకు లేదని పరోక్షంగా చెప్పేశాడు.
     
భారత టెస్టు జట్టులో ఇకపై పుజారా, రహానే కనిపించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తాజాగా గంగూలీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ విలేకరులతో మాట్లాడాడు. "మీరు ఎప్పటికీ క్రికెట్ జట్టుతో ఉండలేరు. ప్రతి ఒక్క క్రికెటర్ కెరీర్ లో ఇది అందరికీ జరుగుతుంది. భారత క్రికెట్‌కు రహానే, పుజారా చేసిన సేవలకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలి. సెలెక్టర్లు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. మన దేశ క్రికెట్ లో అపార ప్రతిభ ఉంది. జట్టు పురోగతి సాధించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు". అని ఓ వైపు వీరిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తూనే.. యంగ్ టాలెంట్ జట్టుకు అవసరం అని సూచించాడు.
    
2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. మరోవైపు రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.