WTC FINAL: మార్క్రమ్ సూపర్ సెంచరీ.. WTC ఫైనల్‎లో విజయం దిశగా సౌతాఫ్రికా

WTC FINAL: మార్క్రమ్ సూపర్ సెంచరీ.. WTC ఫైనల్‎లో విజయం దిశగా సౌతాఫ్రికా

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మరో 69 పరుగులు చేస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా తొలిసారి సౌతాఫ్రికా అవతరించనుంది. సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (102 నాటౌట్) కీలకమైన ఫైనల్లో సూపర్ సెంచరీతో రాణించాడు. 

ఇన్సింగ్స్ ప్రారంభంలోనే రెండు వికెట్లు పడ్డ.. కెప్టెన్ బవుమా (65 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. రికెల్టన్ 6, ముల్డర్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు ప్రభావం చూపించకపోవడంతో ఆసీస్‎కు కష్టాలు తప్పలేదు.

సౌతాఫ్రికా విజయానికి ఇంకా 69 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఇంకో 8 వికెట్లు ఉన్నాయి. మార్క్రమ్, బవుమా అద్భుత ఫామ్‎లో ఉండటంతో సౌతాఫ్రికా గెలుపు లాంఛనంగా మారింది. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తే తప్ప సౌతాఫ్రికా విజయాన్ని అడ్డుకోలేరు.  

అంతకుముందు 8 వికెట్ల నష్టానికి 144 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 2 పరుగులు చేసిన లియాన్‎ను రబడా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న సమయంలో చివరి వికెట్ కు స్టార్క్ (58), హేజల్ వుడ్ (17) అద్భుతంగా పోరాడారు. సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఆసీస్ ఆధిక్యం 275 పరుగులు దాటింది. స్టార్క్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

చివరి వికెట్ రూపంలో కంగారు పెడుతున్న ఈ జోడీని ఎట్టకేలకు మార్కరం విడగొట్టాడు. 17 పరుగులు చేసిన హేజల్ వుడ్ మార్కరం బౌలింగ్‎లో ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. పదో వికెట్‎కు స్టార్, హేజల్ వుడ్ జోడీ 135 బంతుల్లో 55 పరుగులు జోడించి జట్టుకు కీలక పరుగులు అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి 3.. జాన్సెన్, ముల్డర్, మార్కరం తలో వికెట్ తీసుకున్నారు.