చెలరేగిన డికాక్‌‌, డుసెన్‌‌.. శ్రీలంకపై సౌతాఫ్రికా  గెలుపు

చెలరేగిన డికాక్‌‌, డుసెన్‌‌.. శ్రీలంకపై సౌతాఫ్రికా  గెలుపు
  • 428/5తో వరల్డ్​ కప్​లో సౌతాఫ్రికా హయ్యెస్ట్​ స్కోరు  
  • 49 బాల్స్​లోనే ఫాస్టెస్ట్​ సెంచరీ కొట్టిన మార్​క్రమ్ 

న్యూఢిల్లీ: అండర్​డాగ్​గా బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరల్డ్‌‌ కప్‌‌లో తొలి మ్యాచ్​లోనే తమ బ్యాటింగ్​ దమ్ముచూపెట్టింది. క్వాలిఫయర్​గా వచ్చిన శ్రీలంకపై రికార్డుల మోత మోగించింది. ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ (54 బాల్స్‌‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 106) ఫాస్టెస్ట్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ సెంచరీ (49 బాల్స్‌‌) దంచిన వేళ.. శనివారం జరిగిన మ్యాచ్‌‌లో సఫారీ జట్టు 102 రన్స్‌‌ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. టాస్‌‌ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 428/5 స్కోరు చేసింది. దీంతో వరల్డ్‌‌ కప్‌‌లో అత్యధిక స్కోరు చేసిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.

2015లో అఫ్గానిస్తాన్‌‌పై ఆసీస్‌‌ చేసిన 417/7 రికార్డును బ్రేక్‌‌ చేసింది. మార్‌‌క్రమ్‌‌కు తోడుగా, డికాక్‌‌ (84 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 100), డుసెన్‌‌ (110 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 108) కూడా సెంచరీలు బాదారు. తర్వాత శ్రీలంక 44.5 ఓవర్లలో 326 రన్స్‌‌కు ఆలౌటైంది. కుశాల్‌‌ మెండిస్‌‌ (76), చరిత్‌‌ అసలంక (79), దాసున్‌‌ షనక (68) హాఫ్‌‌ సెంచరీలతో రాణించినా ప్రయోజనం లేకపోయింది. కోయెట్జీ 3, జాన్సెన్‌‌, రబాడ, కేశవ్‌‌ తలో రెండు వికెట్లు తీశారు. మార్‌‌క్రమ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బంగ్లాదేశ్​ బోణీ

ధర్మశాల: మెహిదీ హసన్‌‌ మిరాజ్‌‌ (57, 3/25) ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టడంతో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన అఫ్గాన్‌‌ 37.2 ఓవర్లలో 156 రన్స్‌‌కు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్‌‌ (47) టాప్‌‌ స్కోరర్‌‌. ఇబ్రహీం జద్రాన్‌‌ (22), అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (22)తో కాసేపు పోరాడారు. బంగ్లా బౌలర్లలో షకీబ్‌‌ 3, షోరిఫుల్‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్‌‌ 34.4 ఓవర్లలో 158/4 స్కోరు చేసి గెలిచింది. 27 రన్స్​కే2 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మెహిదీ, నజ్ముల్‌‌ హుస్సేన్‌‌ (59 నాటౌట్‌‌) మూడో వికెట్‌‌కు 97 రన్స్‌‌ జోడించి గెలిపించారు. మెహిదీ హసన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.