SAvsWI:టీ20 మ్యాచ్లో 500 పరుగులు..

SAvsWI:టీ20 మ్యాచ్లో 500 పరుగులు..

టీ20లో ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. 120 బంతుల్లో 200 పరుగులు చేయడమే గొప్ప అనుకుంటే ఏకంగా..వెస్టిండీస్ 258 పరుగులు సాధించింది. విండీస్ భారీ స్కోరు చేసిందని ఆశ్చర్యపోతే..మేం ఏమన్నా తక్కువ తిన్నామా అంటూ సౌతాఫ్రికా ఈ భారీ స్కోరును ఛేదించి చరిత్ర సృష్టించింది. విండీస్ పై 6 వికెట్లతో గెలిచింది. 


వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20ల్లో ఏకంగా 500 పరుగులు నమోదవడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్..20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మన్ జాన్సన్ చార్లెస్..46 బంతుల్లో 118 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 10 ఫోర్లు, 11 సిక్సులు ఉండటం గమనార్హం. ఇతడు 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా..సెంచరీ చేసేందుకు మరో 16 బంతులను మాత్రమే ఎదర్కొన్నాడు. చార్లెస్‌తో పాటు ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ 51 పరుగులతో రాణించాడు. చివర్లో షెపర్డ్ 18 బంతుల్లో 41 పరుగులతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 3 వికెట్లు, పార్నెల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

సూపర్ ఛేజ్.. 

259 పరుగుల టార్గెట్...అంతే సౌతాఫ్రికా పనైపోయిందని అంతా అనుకున్నారు. 200 పరుగుల వరకు చేస్తుందని భావించారు. కానీ అంచనాలను సౌతాఫ్రికా తలకిందులు చేసింది. ఓపెనర్లు  డి కాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. హెండ్రిక్స్ 28 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ కొట్టాడు. వీరిద్దరు బ్యాటింగ్ చేస్తుంటే..బౌండరీలు చిన్నబోయాయి. విండీస్ బౌలర్లను ఇద్దరు ఉతికారేయడంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా స్కోరును వంద దాటింది. ఓపెనర్లు ఔటైన తర్వాత కెప్టెన్ మార్ క్రమ్ 21 బంతుల్లో 38 పరుగులు, క్లాసెన్ 7 బంతుల్లో 16 పరుగులతో చెలరేగడంతో సౌతాఫ్రికా మరో 7 బంతులుండగానే లక్ష్యాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. దీంతో  మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్, స్మిత్, రెఫర్, పావెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.