
హైదరాబాద్సిటీ, వెలుగు: టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానాగా దక్షిణ మధ్య రేల్వే సోమవారం ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. దీపావళి, ఛాట్ పండుగల సీజన్ తో అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్లలో అధికారులు తనిఖీలు తీవ్రం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో సోమవారమంతా తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా జర్నీ చేస్తున్న ప్రయాణికులను గుర్తించి జరిమానా వసూలు చేశారు.
మొత్తం రూ.1.08 కోట్ల ఆదాయం ఫైన్ రూపంలో లభించిందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై మొత్తం 16,105 కేసులు నమోదు చేశామని చెప్పారు. సాధారణంగా జోన్ పరిధిలో రోజువారీ టికెట్ తనిఖీల్లో దాదాపు 9,500 కేసుల నమోదుతో సుమారు రూ.47 లక్షల ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. కానీ, దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే రోజు టికెట్ తనిఖీలతో ఆదాయం రూ. కోటి దాటడం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ అభినందించారు.