
బెంగళూరు: బ్యాటింగ్‌లో రాణించిన సౌత్ జోన్, సెంట్రల్ జోన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించాయి. నారాయణ్ జగదీశన్ (52 నాటౌట్) బ్యాటింగ్‌లో మరోసారి మెరవడంతో.. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో 175 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సౌత్ జోన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 278/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆఖరి రోజు ఆట కొనసాగించిన నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 100.1 ఓవర్లలో 361 రన్స్‌కు ఆలౌటైంది.
శుభమ్ ఖజురియా (128) సెంచరీతో ఆకట్టుకోగా, మయాంక్ డాగర్ (31) ఫర్వాలేదనిపించాడు. సాహిల్ లోట్రా (19), అకీబ్ నబీ (10), యుధ్వీర్ సింగ్ (7) ఫెయిలయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 4, నిధిశ్ 3 వికెట్లు తీశారు. తర్వాత సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో 95/1 స్కోరు చేసింది. తన్మయ్ అగర్వాల్ (13) విఫలమైనా, జగదీశన్, దేవదత్ పడిక్కల్ (16 నాటౌట్) మెరుగ్గా ఆడారు. అకీబ్ నబీ ఒర వికెట్ తీశాడు. నారాయణ్ జగదీశన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’
అవార్డు లభించింది.
సారాన్ష్ జైన్ సూపర్..
వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ కూడా డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (162) కారణంగా సెంట్రల్‌కు ఫైనల్ బెర్త్ ఖాయమైంది. 556/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌లో 164.3 ఓవర్లలో 600 రన్స్‌కు ఆలౌటైంది. సారాన్ష్ జైన్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా, యష్ ఠాకూర్ (21) ఓ మాదిరిగా ఆడాడు. ధర్మేంద్రసింగ్ జడేజా 4, అర్జాన్ 3 వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 53.3 ఓవర్లలో 216/8 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (64), తనుష్ కొటియాన్ (40 నాటౌట్), ఆర్యా దేశాయ్ (35) మెరుగ్గా ఆడినా మిగతా వారు నిరాశపర్చారు. సారాన్ష్ 5, హర్ష్ దూబే 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు, 63 రన్స్ చేసిన సారాన్ష్ జైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.