హబీబ్ మహ్మద్@ 42 చోరీలు

హబీబ్ మహ్మద్@ 42 చోరీలు
  • పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన సౌత్ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • రూ. 11 లక్షల విలువైన బంగారు నగలు, బైక్ స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సౌత్ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ నగర్ ఏసీపీ గౌస్ కేసు వివరాలను వెల్లడించారు. బార్కాస్ లోని షాహిన్ నగర్ కు చెందిన హబీబ్ మహ్మద్ అలియాస్ చోటు (35) తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. సిటీ కమిషనరేట్ పరిధిలో 42 ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. చాంద్రాయణగుట్ట పీఎస్ లో నమోదైన కేసులో హబీబ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండటంతో పోలీసులు అతడిని గతేడాది అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఏడాది జులై మొదటివారంలో బయటికొచ్చిన హబీబ్ మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. గత నెల 11న అర్ధరాత్రి మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధి వట్టేపల్లి సైఫీ కాలనీలో బైక్ చోరీ చేశాడు. దాని నంబర్ ప్లేట్ మార్చాడు. 

ఆ బైక్ పై తిరుగుతూ రెక్కీ నిర్వహించాడు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించాడు. గత నెల 24, 30వ తేదీల్లో అర్ధరాత్రి సంతోష్ నగర్ లోని రెండు ఇండ్లల్లో హబీబ్ దొంగతనం చేశాడు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల డేటాను పరిశీలించారు. హబీబ్ మహ్మద్ ఈ దొంగతనాలు చేసినట్లు గుర్తించి అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు.  రూ. 11 లక్షల 30 వేల విలువైన 170 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి నగలు, బైక్, ఎల్ఈడీ టీవీ, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.