- సంగారెడ్డి జిల్లా కొల్లూరు గౌడియం స్కూల్లో ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్' (ఎస్ఐఎస్ఎఫ్)–2026’ జరగనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులోని ‘ది గౌడియం స్కూల్’లో ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సహకారంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి నుంచి 9, 10వ తరగతి విద్యార్థులుసైన్స్ ఫెయిర్‌లో పాల్గొంటున్నారు.
ప్రతి రాష్ట్రం నుంచి 35 చొప్పున.. మొత్తం 210 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించనున్నారు. 10 గ్రూప్ ఎగ్జిబిట్స్, 15 ఇండివిడ్యువల్, 10 టీచర్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. మొత్తం 210 మంది స్టూడెంట్లు, 210 మంది టీచర్లు హాజరవుతున్నారు. కాగా, రొటేషన్ పద్ధతిలో జరిగే సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించే అవకాశం 2026కు గానూ తెలంగాణకు దక్కింది. చివరిసారిగా 2018లో సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ మన రాష్ట్రం ఈ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఏర్పాట్లు పూర్తి సైన్స్ ఫెయిర్ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రావీణ్య పర్యవేక్షణలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సైన్స్ ఫెయిర్ జరిగినన్ని రోజులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 3 వేల నుంచి 4 వేల మంది విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. 18న రిజిస్ట్రేషన్లు ఉంటాయని, 19 నుంచి 23 వరకు ప్రదర్శన కొనసాగుతుందని డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
