పాప్ సింగర్లను చూడాలని ఇంట్లోంచి పారిపోయిన్రు

పాప్ సింగర్లను చూడాలని ఇంట్లోంచి పారిపోయిన్రు
  •  వైజాగ్ నుంచి షిప్​లో కొరియా వెళ్లాలని అమ్మాయిల ప్లాన్
  • ఈరోడ్​ నుంచి చెన్నై వచ్చాక.. మనసు మార్చుకున్న బాలికలు 
  • సేఫ్​గా ఇండ్లకు చేర్చిన పోలీసులు

చెన్నై: సౌత్ కొరియన్ పాపులర్ బ్యాండ్ బీటీఎస్ ట్రూప్ అంటే ఆ అమ్మాయిలకు విపరీతమైన​ అభిమానం. ఆ వెర్రి అభిమానమే వాళ్లను ఇండ్లలోంచి పారిపోయేలా చేసింది. తమిళనాడుకు చెందిన 8 వ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు.. ఎలాగైనా తమ ఫేవరెట్ స్టార్స్ బీటీఎస్ ట్రూప్​ ను చూడాలనుకున్నారు. అందుకు సౌత్ కొరియాలోని సియోల్​కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. చెప్పాపెట్టకుండా ఇండ్లలోంచి బయల్దేరి చెన్నైదాకా పోయారు. చేతిలో డబ్బులు, పాస్​పోర్ట్ లేకుండా ముందుకెళ్లడం సాధ్యం కాదని తెలుసుకుని పోలీసుల సాయంతో  సొంతిండ్లకు చేరుకున్నారు.

ప్యాకెట్ మనీ 14 వేలతో బయల్దేరి.. 

తమిళనాడు ఈరోడ్​కు దగ్గర్లోని ఓ ప్రభుత్వ స్కూల్​లో 8వ క్లాస్ చదువుతున్న 13 ఏండ్ల వయసు అమ్మాయిలు వాళ్లు. పాస్​పోర్ట్ లేకున్నా సియోల్ వెళ్లొచ్చని ఇంటర్నెట్​ద్వారా తెలుసుకున్నారు. విశాఖపట్నం నుంచి షిప్​లో సియోల్ పోవచ్చని ప్లాన్ చేశారు. ప్యాకెట్ మనీ కలెక్షన్స్ రూ.14 వేలు తీసుకుని ఈరోడ్ నుంచి ఈ నెల 4న చెన్నైకి రైలెక్కారు. అక్కడ అతికష్టంమీద లాడ్జిలో రూమ్ దొరికించుకున్నారు. రూమ్ కోసం పడిన తిప్పలో.. లేక డబ్బులు సరిపోవని అనుకున్నారేమో కానీ మనసుమార్చుకున్నారు.  

ఇంటికి తిరిగి వెళ్లిపోయేందుకు ఆదివారం చెన్నై నుంచి ఈరోడ్​కు రైలెక్కారు. మధ్యలో నీళ్లకోసం వెల్లూర్ జిల్లాలోని కాట్పాడిలో దిగడంతో రైలు మిస్సయింది. అప్పటికే  ఈ బాలికలు మిస్సింగ్ అన్న వార్తతో అలర్టయిన పోలీసులు.. సోదాలు చేస్తూ ఈ అమ్మాయిలను గుర్తించారు. వాళ్లు చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించడంతో తల్లిదండ్రులను పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇండ్లకు పంపించారు.