భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

 భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు రుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్నభారీ వర్షాలకు  దక్షిణ కన్నడ జిల్లా ముల్కిలోని బప్పనాడు శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం.. పాక్షికంగా నీట మునిగింది. గర్భగుడి మినహా ఆలయ ప్రాంగణమంతా వర్షపునీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. పెద్దఎత్తున వర్షపు నీరు ఆలయం లోపలికి చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

అలాగే... 24 గంటల్లో గోవా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD తెలిపింది. వీటితోపాటు ఒడిషా, గుజరాత్, చత్తీస్ ఘడ్, కేరళలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  వాతావరణశాఖ తెలిపింది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

అటు...దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు ఏర్పాడ్డాయి. ఇక ముంబైలో రాత్రి నుంచి వర్షాల తీవ్రత పెరిగింది. దాదర్, మహిమ్, ఖార్, మాతుంగా, కుర్లా వంటి పలు ప్రాంతాల్లో గత 12 గంటల్లో వర్షపాతం 40 మిల్లీ మీటర్ల నుంచి 70 మిల్లీ మీటర్ల వరకు నమెదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళలోని కొట్టాయంలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. మరోవైపు కక్కాడ్ నది పొంగి పొర్లడంతో కన్నూర్ కు వరద పొటెత్తింది. దీంతో అక్కడి నివసించే వారి ఇళ్లు మునిగిపోయాయి. అధికారులు చర్యలు చేపడుతున్నారు..