తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వానలు

తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వానలు
  •     వనపర్తి జిల్లా పెబ్బేరులో 7.1 సెంటీ మీటర్ల వర్షం
  •     సోమవారం నుంచి భారీ వర్షాలు
  •     ఎల్లో అలర్ట్  జారీచేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ, హనుమకొండ, మహబూబాబాద్​ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాల్లోని అన్ని చోట్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో 5.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 5.2, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​లో 5.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

వికారాబాద్​ జిల్లా రాపోలులో 4.1, సూర్యాపేట జిల్లా నడిగూడెం, మెదక్​ జిల్లా మాసాయిపేటలో 4, రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో 3.9, ములుగు జిల్లా వాజేడు, నల్గొండ జిల్లా పజ్జూరులో 3.4, కరీంనగర్​ జిల్లా రేణికుంటలో 3.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలో నమోదైన టాప్​ టెన్​ అత్యధిక వర్షపాత ప్రాంతాలన్నీ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ప్రాంతాలే. ఇటు హైదరాబాద్​లోనూ సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది.

బండ్లగూడలో అత్యధికంగా 2.8 సెంటీ మీటర్లు, సరూర్​నగర్​, బహదూర్​పురలో 2.4, చంపాపేటలో 2.3, కందికల్​ గేట్​, గచ్చిబౌలిలో 2.2, లింగోజిగూడ, ఫూల్​బాగ్​, బార్కస్​లో 2.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉంటాయని.. సోమ, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.