V6 News

కులగణన రిపోర్ట్ ను ఆహ్వానిస్తున్నం : ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ సింహాద్రి యాదవ్

కులగణన రిపోర్ట్ ను ఆహ్వానిస్తున్నం : ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ సింహాద్రి యాదవ్
  •     ఈ రిపోర్ట్​ ఎన్నో వాస్తవాలను బయటపెట్టింది: ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ సింహాద్రి యాదవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన కుల సర్వే రిపోర్ట్ ను సమాజ్​వాది పార్టీ ఆహ్వానిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ అన్నారు. ఇంతవరకు తెలియని అభివృద్ధి వాస్తవాలను సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే బయటపెట్టిందని తెలిపారు. పలువురు ఈ రిపోర్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. ఇందులో ప్రచురించిన డేటా ఒక పెద్ద మైన్ లాంటిదన్నారు.  శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలసీపరంగా, సామాజిక చైతన్యం పరంగా, పౌర సమాజం పరంగా తెలంగాణ కుల సర్వే రిపోర్టు రాష్ట్ర ఆలోచనలకు ఒక దిక్సూచి గా తోడ్పడుతుందన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కులగణన సర్వే దేశస్థాయిలో కాకున్నా, రాష్ట్రస్థాయిలో సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. 

‘1980 లో వెనకబడిన తరగతుల రిపోర్టును అమలు జరిపినప్పుడు కొందరు అగ్రవర్గాలు వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు స్వాగతించారు. అదే సమయంలో 1990 లో మండల్ కమిషన్ రిపోర్టుతో మొదలైన క్యాస్ట్ సెన్సెస్ చర్చ ఈనాటికీ కొనసాగుతున్నది. దేశస్థాయిలో క్యాస్ట్ సెన్సెస్ పై చర్చ ఎన్నో మలుపులు తిరుగుతున్నది. కానీ, కుల సర్వే ద్వారా తెలుసుకునే విషయాలు దేశ సమతుల్య అభివృద్ధికి కీలకమైనది. కుల సర్వే ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. 

సరైన వాస్తవ ప్రాతిపదికపై విశ్లేషణ జరిపినప్పుడు సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ఈ రిపోర్ట్ తోడ్పడుతుంది. కులం సామాజిక వెనుక బాటుకు గురి చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ వర్గాలు మానవీయ కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.’ అని ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ అన్నారు.  తెలంగాణ కుల సర్వే రిపోర్టు మండల స్థాయి డేటాతో ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.