భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేగళ్లలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. పోలీస్, ఎన్నికల అధికారులను అడిగి నామినేషన్ ప్రక్రియ సరళిని తెలుసుకున్నారు. అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న స్టాటిక్ సర్వేలేయన్స్ చెక్‌పోస్ట్‌ను సందర్శించారు.
అక్కడ వాహన తనిఖీల వివరాల రిజిస్టర్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా నగదు, మద్యం, మరే ఇతర వస్తువులను అక్రమ రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీల్లో ఆయన వెంట చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
