న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు భారీ బూస్ట్ లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు రూ.13,705.60 కోట్లు కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025~26) బడ్జెట్ అంచనా రూ.13,416 కోట్లతో పోలిస్తే 2.16 శాతం ఎక్కువ. అలాగే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ. 12,448.60 కోట్లతో పోలిస్తే దాదాపు 10.1% పెరిగింది.
ఈ కేటాయింపు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) భవిష్యత్ లక్ష్యాలైన గగన్‌యాన్ మిషన్, స్వదేశీ స్పేస్ స్టేషన్ నిర్మాణం, మానవ స్పేస్‌ఫ్లైట్లు, నెక్స్ట్ జెనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) వంటి ప్రాజెక్టుల డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడనుంది. మొత్తం రూ.13,705.60 కోట్లలో స్పేస్ టెక్నాలజీ హెడ్ కింద రూ. 10,397.06 కోట్లు కేటాయించారు.
ఈ నిధులు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ వంటి వివిధ ఇస్రో సెంటర్లలోని స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్, టెస్టింగ్, రీసెర్చ్, గగన్‌యాన్, ఎన్జీఎల్వీ, స్పేస్ స్టేషన్, ల్యాబ్‌లు, టెస్ట్ బెడ్‌లు, ఎక్విప్‌మెంట్ వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకు ఉపయోగించనున్నారు.
మిగిలిన నిధులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఇతర ప్రధాన హెడ్‌లకు వెళ్తాయి. మొత్తం కేటాయింపులో రూ.7,329.70 కోట్లు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌గా, రూ. 6,375.90 కోట్లు క్యాపిటల్ స్పెండింగ్‌గా ఉన్నాయి. గతేడాది రివైజ్డ్ క్యాపిటల్ ప్లాన్‌తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ దాదాపు రూ.1,066 కోట్లు పెరిగింది.
ఇస్రో ఈ ఏడాది గగన్‌యాన్ మిషన్ అన్‌క్రూడ్ ఫ్లైట్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అలాగే, భారీ పేలోడ్‌లను ఆర్బిట్‌లోకి తీసుకెళ్లే నెక్స్ట్ జెనరేషన్ లాంచ్ వెహికల్ ను అభివృద్ధి చేస్తున్నది.
