దెబ్బకు ఫ్రాన్స్ ఔట్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్ 

దెబ్బకు ఫ్రాన్స్ ఔట్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్ 

Spain vs France: మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) అంతిమ ఘట్టానికి చేరుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరులో స్పెయిన్ 2–0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్ జట్టు పటిష్టమైన డిఫెన్స్, క్లినికల్ ఫినిషింగ్‌తో ఫ్రాన్స్ (Les Bleus) ఆటకట్టించింది. ఈ గెలుపుతో తమ రెండో ప్రపంచకప్ కలని నిజం చేసుకోవడానికి స్పెయిన్ కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. ఆదివారం న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో ఇంగ్లాండ్-అర్జెంటీనా సెమీఫైనల్ విజేతతో స్పెయిన్ పోటీ పడనుంది. 

ఓయర్జబల్ పెనాల్టీ గోల్: 
మ్యాచ్ ప్రారంభంలో కైలియన్ ఎంబాపె కౌంటర్ ఎటాక్‌లతో ఫ్రాన్స్ కాస్త ప్రమాదకరంగా కనిపించినప్పటికీ, స్పెయిన్ చాకచక్యంగా మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. యంగ్ ప్లేయర్ లమైన్ యమల్ బాక్స్‌లోకి దూసుకెళ్తున్న సమయంలో లూకాస్ డిగ్నే అతడిని కిందపడేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ దొరికింది. దీనిని మిగ్యుల్ ఓయర్జబల్ ఏమాత్రం పొరపాటు చేయకుండా గోల్‌గా మార్చి స్పెయిన్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పెడ్రో పోరో, డాని ఓల్మోతో కలిసి అద్భుతమైన వన్-టూ పాస్‌లతో దూసుకెళ్లి ఫ్రాన్స్ కీపర్ మైక్ మైగ్నాన్‌ను ఛేదిస్తూ బంతిని బాటమ్ కార్నర్‌కు పంపించాడు. దీంతో స్పెయిన్ 2–0తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 

ఎంబాపెను అడ్డుకున్న డిఫెన్స్: 
రెండు గోల్స్ వెనుకంజలో ఉన్న ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ వెంటనే డెసిర్ డౌ, రాయన్ చెర్కిలను గ్రౌండ్ లోకి దించి పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఫ్రాన్స్ తీవ్రమైన ఒత్తిడి పెంచినప్పటికీ, స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ స్వీపర్ సూపర్ గా-ప్రదర్శన చేశాడు. మరోవైపు డిఫెండర్ మార్క్ కుకురెల్లా కూడా అడ్డుగోడలా నిలిచి ఎంబాపె అండ్ కోను పూర్తిగా కట్టడి చేశారు. స్పెయిన్ డిఫెన్స్ లైన్ చాలా పకడ్బందీగా వ్యవహరించడంతో ఫ్రాన్స్‌కు గోల్ చేసే అవకాశం దక్కలేదు. 

ALSO READ : అదిరిపోనున్న ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీ.. 

2010 హిస్టరీ రిపీట్ అవుతుందా?: 
రెఫరీ ఫైనల్ విజిల్ వేయడంతో స్పెయిన్ ప్లేయర్స్, అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓడిపోయిన ఫ్రాన్స్ జట్టు ఇప్పుడు థర్డ్ ప్లేస్ ప్లేఆఫ్ మ్యాచ్ కోసం రెడీ కావాల్సి ఉంది. అందులో ఎంబాపె గోల్స్ చేసి అడిడాస్ గోల్డెన్ బూట్ గెలుచుకునే అవకాశాలను మెరుగు పర్చుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు స్పెయిన్ మాత్రం తమ చారిత్రాత్మక 2010 ప్రపంచకప్ విజయాన్ని మళ్లీ పునరావృతం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న స్పెయిన్‌ను ఫైనల్లో అడ్డుకోవడం ప్రత్యర్థి జట్టుకి అంత ఈజీ కాకపోవచ్చు.