
- సభ్యులు అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి
- సీఎస్, డీజీపీ, సీపీకి స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలని సీఎస్ రామకృష్ణ రావుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన సమాచారాన్ని వెంటనే అందించాలన్నారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున శుక్రవారం అసెంబ్లీలో సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవి గుప్తా, సీపీలు సీపీ ఆనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహంతి, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, డీసీపీతో స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. గత సమావేశాల మాదిరే ఈ సెషన్‌ను సైతం సక్సెస్ చేయాలని అధికారులను కోరారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలు, భారీ వర్షాల నేఫథ్యంలో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునేలా సహకరించాలని పోలీసులను స్పీకర్ కోరారు.
సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని సూచించారు.