రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెడుతున్నం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెడుతున్నం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

బషీర్ బాగ్,వెలుగు: బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.  అలాకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తుందన్నారు.

హైదరాబాద్ లక్డీకాపూల్ లో ఆదివారం ఎంఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టెన్త్ , ఇంటర్, డిగ్రీలో 90 శాతానికిపైగా మార్కులు సాధించిన 500 మందికి రూ. 10 వేల చొప్పున చెక్కులను స్పీకర్ ప్రసాద్ కుమార్, ట్రస్ట్ నిర్వాహకులు శివారెడ్డి, శిరీషరెడ్డి పంపిణీ చేశారు.పేద విద్యార్థులకు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తరపున కూడా విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి పెద్దపీట వేసిందన్నారు.