హైదరాబాద్, వెలుగు: బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్యల ఆర్థిక పరిస్థితికి చలించిపోయారు. తన నెల జీతం నుంచి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం.. శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పొన్నం రవిచంద్రతో కలిసి కొమురమ్మకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కొమురమ్మ తనకు పెన్షన్ ఇప్పించాలని కోరగా.. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణరావుతో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. తమ పరిస్థితికి చలించి ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల చెక్కు ను అందచేసిన స్పీకర్ కు కొమురమ్మ ధన్యవాదాలు తెలిపారు. తన భర్త మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్సకు కోసం ఈ డబ్బులు ఉపయోగిస్తానని పేర్కొన్నారు.