
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నుంచి ఇటీవల నోటీసులు అందుకున్న పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరు.. గురువారం అసెంబ్లీ సెక్రటేరియట్‌కు వివరణ పంపించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని గులాబీ పార్టీ నేతలు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆదేశించింది.
దీంతో స్పీకర్ గత నెల మూడో వారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, కృష్ణ మోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డికి నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా తమకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు. దీంతో నోటీసులు అందుకున్న వారిలో అరెకపూడి గాంధీ, కల్వకుంట్ల సంజయ్, మరి కొందరు ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తమ వివరణ పంపినట్లు తెలిసింది.
తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు స్పీకర్ కు పంపిన వివరణలో సదరు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, నోటీసులు అందుకున్న మరికొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నట్లు తెల్సింది.