- ఆధారాలతో హాజరుకావాలని పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
- పదిమందిలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
- తుదిదశకు అనర్హత పిటిషన్ల కేసు
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై బుధ, గురువారాల్లో స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ హాల్ లో చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణను కొనసాగించనున్నారు. బుధవారం దానంపై, గురువారం కడియంపై ఈ విచారణలు కొనసాగనున్నాయి. దానంపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహశ్వర్ రెడ్డి బుధవారం ఆధారాలతో హాజరుకావాలని మంగళవారం స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
దానంపై అనర్హత పిటిషన్లు వేయడానికి ఉన్న ఆధారాలు ఏమిటనేది ఈ ఇద్దరు తమ విచారణలో స్పీకర్ కు అందజేయనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్వర్ రెడ్డి స్పీకర్ ఎదుట తమ అడ్వకేట్లతో సహా విచారణకు హాజరుకానున్నారు. దానం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు.
దీనిపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు వేశారు. ఇక మరో ఎమ్మెల్యే కడియంపై గురువారం స్పీకర్ విచారణ కొనసాగించనున్నారు. కడియం తన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. గురువారం స్పీకర్ ఎదుట జరగనున్న విచారణకు కేపీ వివేకానంద హాజరుకానున్నారు.
మొత్తం పదిమంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని గులాబీ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా..ఇందులో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేసి వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని, పార్టీ మారినట్లు బలమైన ఆధారాలు ఏమీ లేనందున వారిపై వేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు స్పీకర్ తీర్పును వెల్లడించారు. వీరిలో గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలే యాదయ్య, సంజయ్, అరికెపూడి గాంధీ ఉన్నారు.
