యూనివర్సిటీల కోసం పోరాడుదాం..సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ’ సమావేశంలో వక్తలు

యూనివర్సిటీల కోసం పోరాడుదాం..సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ’ సమావేశంలో వక్తలు
  • 2007 నుంచి ఒక్క నియామకం కూడా జరగలే: కోదండరాం
  • ఓయూని పాలకులు నాశనం చేస్తున్నారు: ఆకునూరి మురళి
  • విద్యార్థుల చైతన్యానికి కేసీఆర్‌‌‌‌ భయపడుతున్నరు: హరగోపాల్
  • ఓయూ భూముల మీదున్న మక్కువ.. వర్సిటీ మీద ఎందుకు లేదు: విమలక్క

ముషీరాబాద్/హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యూనివర్సిటీలను కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వర్సిటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వర్సిటీలను రాష్ట్ర సర్కారు నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ లెగసీ, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, విద్య పరిరక్షణ వేదిక, ఓయూ స్కాలర్స్ ఆధ్వర్యంలో ‘సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ

పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ యూనివర్సిటీలను రాకుండా మొదటి ప్రయత్నంలో అడ్డుపడ్డామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం వల్ల వాటిని ఆపలేకపోయామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రొఫెసర్లకు వేతనాలు తప్ప.. సర్కారు వర్సిటీల నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓయూకు మెయింటెనెన్స్ బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ వైపు పరిగెడుతుంటే ఓయూ మాత్రం నిధులు లేక బ్లాక్ బోర్డులకే పరిమితమైందని విమర్శించారు. 

‘‘ఉన్నత వర్గాల పిల్లలు పైసలు ఇస్తూ విద్యను కొంటున్నారు. పైసలు లేని వారి పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్‌‌కు మెస్ చార్జీలను కూడా పెంచడంలేదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు” అని మండిపడ్డారు. ఓయూ ప్రొఫెసర్ల సంఖ్య 1,250 ఉండేదని, ఇప్పుడు 300కు పడిపోయిందని విమర్శించారు. 2007 నుంచి అటెండర్ పోస్ట్ నుంచి ఫ్రొఫెసర్ వరకు ఒక్క నియామకం కూడా జరగలేదని తెలిపారు. ఓయూతో పాటు మిగతా యూనివర్సిటీల సమస్యలపై విద్యార్థులు పోరాడాలని కోరారు.

వర్సిటీల్లో 74% ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ: ఆకునూరి మురళి

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీని పాలకులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తప్పు చేస్తున్నారు కాబట్టే ఓయూకి వెళ్లడం లేదని, కనీసం కేటీఆర్ వెళ్లి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఓయూ ర్యాంక్ దిగజారిపోవడానికి కారణమెవరని నిలదీశారు. సరైన మెయింటెనెన్స్ ఓయూకు చేయడం లేదని, బడ్జెట్ కేటాయించడం లేదని విమర్శించారు. తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో 74% ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలతో విద్యను నాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీ ఎలా ఉందని, ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉందని ప్రశ్నించారు. 

9,000 మంది స్టూడెంట్లు ఒకటే క్యాంపస్‌‌లో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ‘‘వర్సిటీల్లో మౌళిక సదుపాయల కోసం పోరాటాలు, ధర్నాలు చేయలా? కొత్త కోర్సులను ప్రవేశపెట్టకుండా ఉన్న వాటిని తీసివేస్తున్నారు. విదేశాల్లో ఉన్న భుస్వాములకు చెల్లించే రైతుబంధు రూ.600 కోట్లు. కానీ యూనివర్సిటీల్లో నియామకాలు చేపడితే రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి” అని చెప్పారు. సీఎం ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా విద్యా శాఖ మీద రివ్యూ చేయలేదని విద్యశాఖలో పనిచేసిన ఐఏఎస్‌‌ అధికారి చెప్పారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓయూలో పోలీసులను పెట్టి ప్రజాస్వామ్యాన్ని వీసీ రవీందర్ అతిక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘మంత్రివర్గం చేయాల్సిన పని వీసీ రవీందర్‌‌ ఎలా చేస్తారు? ఫీజులను ఎలా పెంచుతారు? మీ ఇష్టమేనా?’’ అని మండిపడ్డారు.

పోరాడిన మేం దేశద్రోహులమా?: విమలక్క

ఓవైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుతుంటే.. మరోవైపు ఉస్మానియాను సేవ్ చేద్దామని ప్రోగ్రాం చేయడం ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా భూముల మీద ఉన్న మక్కువ యూనివర్సిటీ మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన తాము దేశద్రోహులం ఎలా అవుతామని నిలదీశారు.

ప్రొఫెసర్లు ఎందుకు మాట్లాడ్తలే: హరగోపాల్

పోరాడి సాధించుకున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అందరం పాల్గొనాల్సిందని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నిధులు లేక ఓయూ కూలిపోతున్నా ప్రొఫెసర్లు మాట్లాడడం లేదని, ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ‘‘మేం గతంలో పోరాటం చేయలేదా? మీరు పోరాటం చేయకపోతే ఎవరు స్పందిస్తారు?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలను, విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. ఇప్పుడున్న పాలకులు నిజంగా తెలంగాణ రావాలని అనుకున్నారా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. 

విద్యార్థుల చైతన్యానికి కేసీఆర్‌‌‌‌ భయపడుతున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థను బీఆర్ఎస్‌‌ నిర్వీర్యం చేసిందని చరిత్రలో రాయాల్సి ఉంటుందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి ప్రజలకు వివరంగా తెలపాల్సిన బాధ్యతను అందరం తీసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ.. ఏదైనా అంశాన్ని తీసుకుంటే కంప్లీట్ అయ్యేంతవరకు పోరాటం చేయాలని, ఓయూని సేవ్ చేసే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు.