అక్రమంగా చేపడుతున్న భూ సేకరణను నిలిపివేయాలె

అక్రమంగా చేపడుతున్న భూ సేకరణను నిలిపివేయాలె
  • రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు 

హైదరాబాద్ : అభివృద్ధి ముసుగులో అక్రమంగా చేపడుతున్న భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని వక్తలు హెచ్చరించారు. ‘భూ నిర్వాసితుల హక్కులను కాపాడాలి.. వారిపై జరుగుతున్న దాడులను ఆపాలి’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఆశప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, రైతు సంఘం నాయకులు కోదండ రెడ్డితోపాటు వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూ సేకరణ చేపడుతోందని కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే ఏజెంట్లుగా మారి, భూములను బలవంతంగా లాక్కుకుంటున్నారని అన్నారు. రైతులను విభజించి, భయపెట్టి లాక్కోవడం చట్ట విరుద్ధమని చెప్పారు. 

ప్రజా అవసరాల కోసం భూ సేకరణ చేపడితే 2013 చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడింతలు డబ్బులు చెల్లించి సేకరించాలని, నిర్వాసితులుగా మారిన వారికి ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని రైతు సంఘం నాయకులు కోదండ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం  ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకుండానే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల 80 వేల ఎకరాలను సేకరించిందని  భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఆశప్ప ఆరోపించారు. రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భూములు సేకరిస్తోందని మండిపడ్డారు. ప్రజా అవసరాల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే భూ నిర్వాసితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.