వికారాబాద్ లో స్పీకర్ కూతురు అనన్య విజయం

వికారాబాద్ లో స్పీకర్ కూతురు అనన్య విజయం

నెట్​వర్క్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల బరిలో నిలిచిన నేతల వారసుల్లో పలువురు విజయం సాధించగా.. కొందరు ఓటమి పాలయ్యారు. వికారాబాద్​లో కాంగ్రెస్​ నుంచి అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్  కూతురు అనన్య (24), నారాయణఖేడ్​లో జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్ ​తమ్ముడు నరేశ్​ షెట్కార్​ విజయం సాధించారు. అంతేకాకుండా వారు చైర్ పర్సన్​ రేసులోనూ ఉన్నారు. వికారాబాద్​లో 17వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా గడ్డం అనన్య పోటీ చేశారు. 

1,138 మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయాకర్ పై ఆమె గెలిచారు. దయాకర్ కు 81 ఓట్లు  వచ్చాయి. బీఆర్ఎస్​ క్యాండిడేట్​ బీఫాం​సమర్పించిన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. వికారాబాద్​ మున్సిపల్ చైర్ పర్సన్​ స్థానం ఎస్​సీ మహిళకు రిజర్వ్​ కావడంతో అతిపిన్న వయస్సులో (24) ఆమెకు ఆ పదవి లాంఛనం అయ్యింది. 

ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఎంపీ సురేశ్​ షెట్కార్​ సోదరుడు నగేశ్ ​షెట్కార్​ 8వ వార్డు నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఖేడ్​లో 15 వార్డులకుగాను కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. ఇదివరకే నగేశ్​ను చైర్మన్  అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చైర్ పర్సన్​గా ఆయన ఎంపిక ఖాయమైనట్టే. 

ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జోగు రామన్న కొడుకు, మాజీ మున్సిపల్​ చైర్మన్​ జోగు ప్రేమేందర్​ ఓటమి పాలయ్యారు. ప్రేమేందర్  బీఆర్ఎస్  తరపున 34 వార్డు నుంచి పోటీ చేయగా ఆయన మూడో ప్లేస్​లో నిలిచారు. ఈ వార్డును మజ్లిస్  కైవసం చేసుకుంది. ఇక్కడ మజ్లిస్  అభ్యర్థి నజీర్​కు 638 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్​ వకుళాభరణం నిఖిల 626 ఓట్లు పొందారు. ప్రేమేందర్​కు 507ఓట్లు వచ్చాయి. కాగా.. ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు ఈసారి 6 సీట్లు మాత్రమే వచ్చాయి.