వాటర్​ ట్యాంకర్ ట్రాకింగ్​కు స్పెషల్ ​యాప్

వాటర్​ ట్యాంకర్ ట్రాకింగ్​కు స్పెషల్ ​యాప్

హైదరాబాద్, వెలుగు: సిటీలో తాగునీటి కొరత లేకుండా చూసేందుకు వాటర్​బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దాన కిశోర్ ఆదివారం ఖైరతాబాద్​లోని హెడ్డాఫీసులో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటర్ ట్యాంకర్ ఆపరేట్లరతో మాట్లాడారు. నీటి సరఫరాతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న డ్రైవర్ల సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాత్రిళ్లు కమర్షియల్​వినియోగదారులకు ట్యాంకర్లు సరఫరా చేయాలని చెప్పారు. జంట జలాశయాల నుంచి తరలిస్తున్న నీటిని శుద్ధి చేయడానికి కాండ్యూట్ పరిధిలోని 2 ఎంఎల్డీ, 3 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను పున:ప్రారంభించాలని  ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ట్యాంకర్ బుకింగ్స్, ఫాలో అప్ కోసం ఎంసీసీని పర్యవేక్షించాలన్నారు. వినియోగదారులు తమ ట్యాంకర్ బుకింగ్ ని ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం రాత్రి 299 ట్యాంకర్లతో 880 ట్రిప్పులు సరఫరా చేసినట్లు అధికారులు దానకిశోర్​తో చెప్పారు.

ఈ సందర్భంగా 3 నెలలకు ట్యాంకర్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీపై చర్చించారు. ఇప్పటికే 76 కొత్త ట్యాంకర్లు సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5 నాటికి మరో 67 ట్యాంకర్లు సమకూర్చునేందుకు ప్లాన్​చేస్తున్నామన్నారు. సమావేశంలో వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, ఈడీ డా.ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్ డైరెక్టర్ –2 స్వామి, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఓ అండ్ ఎం డివిజన్ 3, 6, 9, 15, 18ల కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు.