రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే

రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే

తండ్రి మాటను జవదాటని కొడుకు. తల్లి కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలి. ధర్మం కోసం పోరాడిన యోధుడు. ప్రజల సంక్షేమానికి విలువ ఇచ్చిన పాలకుడు.. ఇలా ఒక్కటేమిటి ఆయనలో ఉన్నవన్నీ మంచి గుణాలే. శ్రీరామచంద్రుడిని ధర్మానికి ప్రతీకగా చెప్తుంటారు. అందువల్లే అయోధ్య రామయ్యే ఈ అఖండ భారతదేశంలో అందరికీ ఆదర్శంగా మారాడు. అందుకే ఆయన పుట్టిన రోజు శ్రీరామ నవమి నాడు దేశమంతా సంబురాలు చేసుకుంటుంది. 

శ్రీ మహా విష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు అయోధ్య భూమిలో మానవ రూపంలో అవతరించిన రోజే రామనవమి. చైత్ర మాసంలో ఉగాది తర్వాత ఎనిమిది రోజులకు నవమి రోజు రాముడు పుట్టాడు. ఆయన పెండ్లి కూడా ఇదే రోజు జరిగింది. అందుకే దేశమంతా రామాలయాల్లో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ ఉత్సవాలు చేస్తారు. రాముడిని విష్ణువు అర్ధాంశం అని చెప్తారు. అంటే.. విష్ణువులోని సగం దైవిక లక్షణాలు రాముడిలో ఉంటాయి. ‘రామ’ అంటే దివ్యమైన ఆనందం.. ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఆయన కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధి కలిగిన పురుషోత్తముడు అని ఋషులు కీర్తిస్తుంటారు.  రామాయణం ఒక గొప్ప ఇతిహాసం. అందులో చెప్పిన రాముడి కథ... కులం, మతంతో సంబంధం లేకుండా ఎంతోమంది భారతీయుల​కి తెలుసు. రాక్షస రాజు రావణుడిని ఓడించిన గొప్ప వ్యక్తి రాముడు.
 

రాముడు ఎందుకొచ్చాడు? 


దేవుడే రాముడి రూపంలో భూమ్మీదకు వచ్చాడనేది రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా ఒకసారి ఆయన పుట్టుక గురించి గుర్తు చేసుకుందాం. మను రాజు స్థాపించిన అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు రాజ్య పాలన చేశాడు. కానీ.. ఆయనకి వారసులు లేరు. అందుకే పిల్లల కోసం యాగం చేయాలి అనుకున్నాడు. యాగానికి ఋషి ఋష్యశృంగుడు అధ్యక్షత వహించాడు. చివర్లో ఋష్యశృంగుడు మంత్రం పఠించి అగ్నికి నైవేద్యాన్ని సమర్పించాడు. ఆ సమయంలో లంకా రాజు రావణుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఎవరినీ లెక్క చేయడం లేదు. ఎందుకంటే.. దేవతలు, గంధర్వులు, రాక్షసుల చేతిలో తనకు చావు ఉండకూడదని బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందాడు. దానివల్ల తనను ఎవరూ... ఏమీ చేయలేరనే గర్వం పెరిగిపోయింది. అందుకే దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు బ్రహ్మను ప్రార్థించారు. ‘రావణుడికి చావు ఎలా వస్తుందో చెప్పమ’ని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ... ‘రావణుడు మనిషి చేతిలో చనిపోతాడ’ని చెప్పడంతో దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి ‘దశరథ మహారాజు కొడుకుగా పుట్టి, రావణుడిని చంపాల’’ని కోరారు. దాంతో దశరథుడి యాగం ముగిసిన కొన్నాళ్లకు దశరథుడి భార్యలు... కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణశత్రుఘ్నులు పుట్టారు. అలా రాముడు పుట్టిన రోజుని ‘రామనవమి’ అంటున్నాం. సూర్యుడు రామ వంశానికి మూల పురుషుడు. అందుకే వాళ్ల వంశాన్ని రఘుకులం, రఘువంశం అంటారు. ‘రఘు’ అంటే సూర్యుడు. రాముడిని రఘునాథ, రఘుపతి, రాఘవేంద్ర పేర్లతో కూడా పిలుస్తారు. అందుకే కొన్ని హిందూ వర్గాల్లో రామనవమి రోజున రాముడి కంటే ముందు  సూర్యుడికి పూజలు చేస్తారు. 


ఏం నేర్చుకోవచ్చు


రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి? అని ఆలోచించాల్సిన పనిలేదు. రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే. ఆయన అలవాట్లు, పద్ధతులు అన్నీ ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినవే. అదే రావణుడిని తీసుకుంటే... ఆయన గొప్ప పండితుడు. అయినప్పటికీ అహంకారి, అహంభావి. అత్యాశ, కామం అనే అవలక్షణాలు ఉన్న వ్యక్తి. కానీ.. రాముడి  హృదయం.. దైవత్వం, ప్రేమ, దాతృత్వం, వినయం, కర్తవ్య భావంతో నిండి ఉంది. అందుకే రాముడిని దేవుడిగా కొలుస్తున్నాం. 

  • కొడుకుగా: తండ్రి ఏం చెప్పినా గౌరవం, ప్రేమతో పాటిస్తాడు. తండ్రి గౌరవం కోసం తన సౌకర్యాలన్నీ వదిలి అడవులకు వెళ్లాడు. 
  • సవతి తల్లి కొడుకుగా: సవతి తల్లి.. కొడుకు మీద ప్రేమ చూపించకపోయినా, తన సొంత బిడ్డకు అనుకూలంగా ప్రవర్తించినా ఆమెను సొంత తల్లిలాగే చూశాడు. ఆమె కోరికలను గౌరవించాడు. 
  • భర్తగా: భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఆమె రక్షణ, స్వేచ్ఛ కోసం యుద్ధాన్ని జయించాడు.  
  • రాజుగా: ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాజు రాముడు. సొంత సుఖాలు, ఆనందం,  అవసరాల కంటే రాజ్యమే ముఖ్యమని చాటాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాముడి లాంటి రాజు పుట్టలేదు. అందుకే ఇప్పటికీ రామరాజ్యమే గొప్పదని చెప్తుంటారు.