మేడారంలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు : సీతక్క

మేడారంలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు : సీతక్క
  • జాతరలో నిరంతరం తాగునీరందించేలా ఏర్పాట్లు: సీతక్క
  •     వేసవిలో తాగునీటి కొరత రాకుండా సమన్వయం చేసుకోవాలి
  •     గ్రామీణ తాగునీటి సరఫరా మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: మేడారం మహా జాతర దృష్ట్యా తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తామన్నారు. 10వ తేదీన మేడారంలో మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జాతర కాలంలో అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా అయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్లోని ఎర్రమంజిల్‌‌‌‌ మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క మంగళవారం సమీక్షా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంపుసెట్లు పాడైన చోట్ల వెంటనే రిపేర్లు చేపట్టాలని, చిన్న లోపాలతో పెద్ద సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా అన్ని స్థాయిల్లోని అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉందని, ఎప్పటికప్పుడు నీటి నిల్వలను అంచనా వేస్తూ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరం లేని కొత్త బోర్ల వల్ల డబ్బు, శ్రమ రెండూ వృథా అవుతున్నాయని, దీనిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మేడారం మహా జాతరకు ఆహ్వానిస్తూ మిషన్ భగీరథ సిబ్బంది తరఫున ఈఎన్​సీ కృపాకర్ రెడ్డికి మంత్రి సీతక్క ఆహ్వానం పత్రిక అందించారు. 

మేడారం జాతరకు రండి

అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మంగళవారం సీపీఐ, బీజేపీ, ఎంఐఎం శాసనసభా పక్షనేతలకు మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల పసుపు,కుంకుమ అందజేసి ఆహ్వానించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. 

ఎంఐఎం ఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్క అందజేశారు. ఆలయ ప్రసాదమైన బంగారాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు అక్బరుద్దీన్​ ధన్యవాదాలు తెలిపారు.