స్టార్ కోసం ఫ్యాన్ తీసిన సిన్మా

స్టార్ కోసం ఫ్యాన్ తీసిన సిన్మా

చాలా హైప్ తో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన ‘లూసీఫర్’ సినిమాకి ఇది అఫిషియల్ రీమేక్. మలయాళ సినిమా చరిత్రలోనే వందకోట్ల మార్క్ తాకడంతోపాటు, భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా ‘లూసిఫర్’కు మంచి రికార్డు ఉంది. అట్లాంటి సినిమాను తెలుగులో మెగాస్టార్ హీరోగా చేస్తున్నాడంటే తెలుగు మార్కెట్ లెక్కల్లో కచ్చితంగా అంతకుమించిన అంచనాలున్నాయి. అయితే ఒరిజినల్ లూసీఫర్ సినిమా తీసిన తీరు, దాన్ని తెలుగులోకి మార్చిన పద్ధతి ఎట్లా ఉందో సినిమా వచ్చాకే తెలుస్తుంది. అయితే ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కొన్ని అంచనాలను జనం ముందు ఉంచింది. అదేంటో చూద్దాం.

‘గాడ్ ఫాదర్’ లో ఎట్లాంటి మార్పులు చేశారు?

మెగాస్టార్ అసలు ఏజ్ తో పనిలేకుండా ఆయన యంగ్ గా కనిపించాలి, పక్కన బ్యూటీఫుల్ హీరోయిన్ ఉండాలి, ఆమెకు రోల్ ఉన్నా లేకున్నా కలర్ ఫుల్ గా తీసిన సాంగ్స్, అదిరిపోయే స్టెప్స్ మాత్రం మస్ట్ గా ఉండాలి... ఇవే ఫ్యాన్స్ నుంచి ఉండే ఎక్స్ పెక్టేషన్స్. అయితే గాడ్ ఫాదర్ లో అలాంటి వాటికి ఏ మాత్రం చాన్స్ లేదని ముందే తెలిసిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. లూసీఫర్ చాలా గ్రిప్ ఉన్న పొలిటికల్ డ్రామా. ఇది మలయాళంలో మూడేండ్ల కిందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తర్వాత కరోనా కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కథ ఏంటి? ఒరిజినల్ వర్షన్ లో ఎట్లా తీశారన్నది తెలుగు ప్రేక్షకులకు ముందే తెలుసు. అదే గాడ్ ఫాదర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ లో ఎట్లాంటి మార్పులు చేశారు? తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇవ్వడానికి ఇంకేం కొత్తదనం చూపించారన్నదే కీలకం కానుంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ గెస్ట్ గా చేయడం, నయనతార, సత్యదేవ్ లాంటి మంచి క్యాస్టింగ్ సినిమాకు కచ్చితంగా బలమే. కావాల్సిందల్లా కథ ఒరిజినాలిటీ పోకుండా మన నేటివిటీకి తగినట్లుగా ఎట్లా మలిచారన్నదే. ఇక్కడా ఇంకో సమస్య ఉంది. ఆల్రెడీ మోహన్ లాల్ ను చూసిన క్యారెక్టర్ లో మెగాస్టార్ కనిపించినప్పుడు సహజంగానే పోల్చిచూసే అవకాశం ఉంది.

ఇక కథలో మార్పుల సంగతి చూద్దాం.. ట్రైలర్ ను బట్టి చూస్తే ఒరిజినల్ లో పెద్దగా మార్చినట్లుగా అనిపించదు. పాత్రలు, కొన్ని డైలాగులు కూడా దాదాపుగా లూసీఫర్ వర్షన్ లాగే అనిపిస్తాయి. ఒక్క టైటిల్ విషయంలో మాత్రమే కీలకమైన మార్పు కనిపిస్తోంది. హీరో పాత్ర ప్లాష్ బ్యాక్ ఆధారంగా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పెట్టినట్లుగా ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను బట్టి, మహానేతకు–హీరోకు ఉండే రిలేషన్ ను బట్టి చూస్తే ఈ టైటిల్ బాగా ఆలోచించే పెట్టినట్లు అనిపిస్తుంది. నయనతార, సత్యదేవ్ పాత్రలతో పాటు మరోపాత్రను టైటిల్ లో రివీల్ చేసినట్లు కనిపించదు. లూసీఫర్ లో చనిపోయిన మహానేత కొడుకు పాత్రకూ ప్రాధాన్యం ఉంది. కథలో కీలకమైన మలుపు ఇవ్వడంతో పాటు, డిఫరెంట్ వేరియేషన్స్ తో మంచి స్కోప్ ఉన్న చిన్న పాత్ర అది. ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ లో ఆ రోల్ కనిపించకపోవడాన్ని బట్టి అసలు ఆ పాత్రను ఉంచారా, సర్ ప్రైజ్ కోసం దాచారా అన్నది చూడాలి. ఒకవేళ ఆ రోల్ ఉంటే ఎవరు వేశారన్నది కూడా కీలకం అవుతుంది.


 
మోహన్ లాల్ ‘లూసీఫర్’ ఎవరు?
మలయాళ కథకు, తెలుగు కథకు తప్పనిసరైన మార్పు ‘లూసీఫర్’ అనే సినిమా టైటిల్ లోనే ఉంది. నిజానికి రాజకీయ కథలు, మహానేత అయిన నాయకుడి కొడుకు గద్దెనెక్కడం అనే పాయింట్ ఆధారంగా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ లూసీఫర్ ప్రత్యేకత దాని టైటిల్ లోనే ఉంటుంది. కథపై ఒక ఇంప్రెషన్ కలిగించడంలో, హీరో పాత్రను నెగిటివ్–పాజిటివ్ షేడ్స్ లో ఎలివేట్ చేయడానికి ఈ టైటిల్ చాలా కీలకం. అది కేరళ ప్రేక్షకులకు మాత్రమే అర్థమయ్యే పాయింట్. ఈ విషయం లూసీఫర్ ట్రైలర్ చూస్తే కొంచెం అర్థమవుతుంది. ‘రాజ్యాన్ని పాలించే దేవుడు చనిపోయాడు. అప్పటికే రాజ్యంలో దేవతల ముసుగులో రాక్షసులు చేరారు. ఆ రాక్షసులను ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు.. అతడిని హిందువులు రావణుడంటారు. ముస్లింలు ఇబ్లీస్ అంటారు. క్రైస్తవంలో అతనికి ఒక్కటే పేరు.. లూసీఫర్’ అంటూ వాయిస్ బ్రాక్ డ్రాప్ తో లూసీఫర్ ట్రైలర్ లో హింట్ ఇస్తాడు. కేరళలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు జనాభా పరంగా దాదాపు సమానంగా ఉంటారు. పైగా అక్కడ 100 శాతం చదువుకున్నవారు. అందుకే క్రిస్టియన్ గాథకు చెందిన లూసీఫర్ పాత్రను కథలో రిఫరెన్స్ గా వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. అయితే రెగ్యులర్ పొలిటికల్ స్టోరీలతో పోలిస్తే ఇట్లాంటి రిఫరెన్స్ తో కథ అల్లుకోవడం వల్ల దానికి కొత్తదనం వచ్చింది. లూసీఫర్ ప్రత్యేకత అదే. నెగిటివ్-పాజిటివ్ షేడ్స్ ను బ్యాలెన్స్ చేయడానికి లూసీఫర్ అనే రిఫరెన్స్ ను ఉపయోగించుకున్నారు. నిజానికి సినిమాలో హీరో పేరు లూసీఫర్ కాదు.

అయితే ఇట్లాంటి కథను తెలుగులోకి తీసుకున్నప్పుడు లూసీఫర్ అనే రిఫరెన్స్ ను వాడుకునే అవకాశం లేదు. కానీ కథకు కీలకమైన రిఫరెన్స్ పోతే దానిలో ఉన్న బ్యూటీ పోతుంది. అప్పటికే వచ్చిన పొలిటికల్ డ్రామాలా మారిపోతుంది. అందుకే ఒరిజినాలిటీ దెబ్బతినకుండా తెలుగులో ఎలా డీల్ చేశారన్నదే కీలకం అవుతుంది. రీమేక్ ల స్పెషలిస్ట్ గా పేరున్న డైరెక్టర్ మోహన్ రాజాకి ఇదేం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే అసలు సమస్య అది కాదు. 2001లో మోహన్ రాజా తీసిన మొదటి సినిమా హనుమాన్ జంక్షన్. అది ఓ మలయాళ సినిమా రీమేక్. ఆ తర్వాత ఆయన తెలుగు సినిమాలు మానేసి పూర్తిగా తమిళ ఇండస్ట్రీకి మారిపోయాడు. తెలుగు సినిమాలనే వరుసగా తమిళంలో రీమేక్ లు చేస్తూ పోయాడు. జయం, అమ్మానాన్న తమిళఅమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కిక్, ఆజాద్ లాంటి తెలుగు హిట్స్ ను తమిళంలో రిమేక్ చేశారు. తర్వాత మొదటిసారి సొంతంగా రాసుకున్న స్టోరీలతో తనీ ఒరువన్, వేలైక్కారన్ లాంటి సినిమాలు తీసి మంచి హిట్లు కొట్టారు. తనీ ఒరువన్ తెలుగులో ధ్రువ పేరుతో రామ్ చరణ్ హీరోగా వచ్చింది. ఈ నమ్మకంతోనే మోహన్ రాజాకు మెగాస్టార్ ఈ అవకాశం ఇచ్చి ఉండొచ్చు. రీమేక్ లు ఆయనకు కొత్త కాకపోయినా మెగాస్టార్ రేంజ్ నటుడిని, ఆల్రెడీ హిట్టై అందరికీ తెలిసిన కథలో ఎట్లా ఫిట్ చేశారన్నదే  తెలియాలంటే గాడ్ ఫాదర్ చూడాల్సిందే. 

ఇంతకీ లూసీఫర్ ఎవరు?
మలయాళ కథకు కీలకమైన లూసీఫర్ అన్న పేరు ఎట్లొచ్చిందన్నది అసలు పాయింట్. యూదు, క్రిస్టియన్ గాథల ప్రకారం దేవుడితో పాటు స్వర్గంలో ఉండే వేలాదిమంది దేవతల్లో (ఏంజెల్స్) లూసీఫర్ ఒకడు. తనకంటే దేవుడి గొప్పతనం ఏంటని ప్రశ్నిస్తూ లూసీఫర్ తిరుగుబాటు చేస్తాడు. రెండు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన యుద్ధంలో దేవుడు వజ్రాయుధం ప్రయోగించడంతో లూసీఫర్ ఓడిపోతాడు. దేవుడు అతణ్ని శపించి పాతాళంలో పడేస్తాడు. దీంతో దేవుడిపై పగతీర్చుకోవడానికి లూసీఫర్ రకరకాల ఎత్తులు వేస్తుంటాడు. దేవుడు సృష్టించిన భూమి మీద మనుషుల ఆలోచనల్ని చెడగొట్టి ఆయనకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే అతన్ని దయ్యం అనే అర్థంలో ‘సైతాన్’ అని పిలుస్తారు. ఇప్పుడు అసలు లింక్ క్లియర్ గా అర్థమవుతుంది. లూసీఫర్ అంటే అందరికీ తెలిసిన సైతానే. దేవుడు లాంటి నాయకుడు చనిపోయినప్పుడు రాక్షసుల నుంచి రాజ్యాన్ని రక్షించడానికి సైతాన్ లాంటివాడే అవసరం అవుతాడన్న అర్థం వచ్చేలా ‘లూసీఫర్’ సినిమా టైటిల్ పెట్టారు. పొలిటికల్ డ్రామాను ఈ అర్థంలో చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అందులోనూ మోహన్ లాల్ లాంటి నటుడు ఇంత సీరియస్ పాత్రలో అలవోకగా నటించాడు. అందుకే మలయాళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. డబ్బింగ్ చేసినా తెలుగు ప్రేక్షకులనూ ఓటీటీలో ఆకట్టుకుంది. మొత్తం మీద ఇది మంచి సైతాను కథ అనుకోవాలి. మరి సైతాను పేరులేని తెలుగు గాడ్ ఫాదర్ ఎట్లాంటి ఫీల్ ఇస్తాడన్నది మాత్రం చూడాలి.

ఫైనల్ ట్విస్ట్: స్టార్ కోసం ఫ్యాన్ తీసిన సిన్మా
లూసీఫర్ అసలు ప్రత్యేకత దాన్ని తీసిన డైరెక్టర్. ఇప్పటికే మలయాళ స్టార్ హీరోగా ఎదిగిన పృథ్విరాజ్ సుకుమారన్ దీన్ని డైరెక్ట్ చేశాడు. కథ కూడా తనే రాసుకున్నాడు. మోహల్ లాల్ అంటే విపరీతంగా అభిమానించే పృథ్విరాజ్ ఆయన స్ఫూర్తితోనే నటుడిగా ఎదిగాడు. తనూ స్టార్ అయ్యాడు. అయినా అతని అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. తన అభిమాన నటుడితో తనే డైరెక్టర్ గా సినిమా తీయాలనుకున్నాడు. ఎవరో రాసిన కథ ఎందుకని తానే కథ రాసుకున్నాడు. ఫ్యాన్స్ కోసమే డైలాగులు, అవసరం లేని సీన్లు పెట్టే కాలంలో అభిమాన స్టార్ ను ఎట్లా చూపిస్తే బాగుంటుందో బాగా తెలిసిన నిజమైన ఫ్యాన్ పృథ్విరాజ్. అందుకే లూసీఫర్ లాంటి కథను రాసి తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. తన స్టార్ ని మరింత స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. లూసీఫర్ లో హీరోకి అండగా నిలిచే కీలకమైన పాత్రలో పృథ్విరాజ్ కూడా నటించాడు. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే, పృథ్విరాజ్ చేసిన రోల్ లోనే ఇప్పుడు తెలుగులో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఇంక సైతాన్ లేని తెలుగు ‘లూసీఫర్’లో గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ ఎంత వరకు మెప్పిస్తాడో  చూద్దాం.