- ఇంటి నుంచే బుక్ చేసుకునేలా వెసులుబాటు
హైదరాబాద్, వెలుగు: యూరియా పంపిణీలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికత తోడవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా యూరియా సరఫరా జరిగేలా కొత్త యాప్ యూజ్ అవుతది. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే యాప్ నిర్వహణ ఉంటది. యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 10 వేల యూరియా పంపిణీ కేంద్రాలున్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు పెంచుతం. ఇందులో 30 శాతం సెంటర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో, మిగిలిన 70 శాతం ప్రైవేట్ డీలర్లు నిర్వహిస్తారు’’అని ఆయన వెల్లడించారు.
స్టాక్ ఎంత ఉందో చూసుకోవచ్చు
ఈ యాప్ ద్వారా రైతులు తమ సెల్ నంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలతో యూరియా బుకింగ్ చేసుకోవచ్చని గోపి తెలిపారు. ‘‘ఎన్ని బస్తాలు అందుబాటులో ఉన్నాయో యాప్‌లో చూసుకోవచ్చు. రైతులు వేస్తున్న పంటను బట్టి యూరియా సప్లై ఉంటది. కౌలు రైతులు కూడా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు.
షాపులో ఉన్న స్టాక్‌పై డీలర్లు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ ఇస్తుండాలి. అక్టోబర్–మార్చి సీజన్‌కు సుమారు 10 లక్షల టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 4.50 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి’’అని గోపి తెలిపారు.
