- ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
- రుణాల మంజూరిలో డీలే చేయొద్దు..
- దిశా కమిటీ సమావేశంలో ఎంపీ మల్లు రవి
నాగర్‌కర్నూల్, వెలుగు : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్హాల్లో ఎంపీ అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వివిధ శాఖల పనితీరును ఎంపీ సమీక్షించారు.
యువతకు ఉపాధి కల్పించే పీఎంఈజీపీ, ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ లాంటి పథకాల కింద బ్యాంకర్లు త్వరగా రుణాలు మంజూరు చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు లోన్లు ఇవ్వడంలో జాప్యం చేయవద్దని సూచించారు. కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసినా రుణాలు ఇవ్వకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి
బ్యాంకింగ్, జాతీయ రహదారులు, రోడ్లు అండ్ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతి, ఆహారం అందించాలని అధికారులకు సూచించారు.
జాతీయ రహదారులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, పారిశుధ్య నిర్వహణపై నివేదికలను సమీక్షించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తమతమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సౌకర్యాలను కల్పించేలా బాధ్యత యుతంగా అధికారులు పనిచేయాలని, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్లు తీగల సునేంద్ర, శ్రీనివాసులు, దిశా కమిటీ సభ్యులు జడ్పీ సీఈఓ దేవ సహాయం, డీఆర్డీఏ చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

