ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి: వీపీ. గౌతమ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి: వీపీ. గౌతమ్

కాశీబుగ్గ(కార్పొరేషన్​)/హసన్‌పర్తి/జనగామ అర్బన్‌/ధర్మసాగర్‌, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అదనపు భారం పడకుండా చూసుకోవాలని రాష్ట్ర హౌసింగ్‌ఎండీ వీపీ. గౌతమ్‌ సూచించారు. సోమవారం జనగాం, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో పర్యటించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలిసి ఇండ్లకు సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు మంజూరైనా ఇప్పటివరకు నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేసి, పనులు మొదలు పెట్టేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు. ఆగస్టు 15లోగా నిర్మించబోయే ఇండ్లకు మార్కింగ్‌ ఇవ్వాలని, ఆధార్‌ వెరిఫికేషన్‌తో పాటు ఈఎంఈవై పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. తర్వాత హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థనాయక్‌తో కలిసి పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఇండ్ల ఎంత ఎస్‌ఎఫ్‌టీలో కడుతున్నారు ? ఖర్చు ఎంత అవుతుంది ? మేస్త్రీలకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు ? లబ్ధిదారులు అదనంగా కలుపుకుంటున్నారా ? అనే వివరాలు తెలుసుకున్నారు. జనగామ జిల్లా నిడిగొండలో మాట్లాడుతూ ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ ప్రకారమే ఇండ్లు నిర్మించుకోవాలని, ఆర్థికంగా భారం పడకుండా చూసుకోవాలని చెప్పారు.